నక్సలైట్ నాయకుడిగా రానా  

నక్సలైట్ నాయకుడిగా రానా  

రానా కథానాయకుడిగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం’ సినిమా రూపొందింది. తెలంగాణలో ఒకప్పుడు ఉద్ధృతంగా వున్న నక్సలిజం నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమైంది. సురేశ్ బాబు .. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. బలమైన ఎమోషన్స్ చుట్టూ ఈ కథను అల్లుకున్నారు. ఈ సినిమాలో రానా సరసన నాయికగా సాయిపల్లవి నటించింది. ఈ ఏప్రిల్ లోనే ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయాలనుకున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా పూర్తయ్యాయి. అయితే కరోనా కారణంగా విడుదల వాయిదాపడింది.త్వరలో థియేటర్స్ తెరుచుకోనుండటంతో, ఈ సినిమా థియేటర్లలోనే విడుదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా ఓటీటీ ద్వారా పలకరించనున్నట్టు ఒక వార్త బలంగా వినిపిస్తోంది. వెంకటేశ్ కథానాయకుడిగా చేసిన ‘నారప్ప’ .. ‘దృశ్యం 2’ సినిమాలు ఓటీటీ ద్వారానే విడుదలవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో ‘నారప్ప’ స్ట్రీమింగ్ కానుండగా, హాట్ స్టార్ ద్వారా ‘దృశ్యం 2’ రానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘నెట్ ఫ్లిక్స్’లో ‘విరాటపర్వం’ రానుందని అంటున్నారు. అందుకు సంబంధించిన చర్చలు దాదాపు పూర్తయ్యాయని చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.