తమిళ చిత్రాలతో రాశీఖన్నా బిజీ

తమిళ చిత్రాలతో రాశీఖన్నా బిజీ

కొద్దికాలంలోనే మంచి గుర్తింపు అందుకున్న రాశీఖన్నా ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది. అయితే, ఈ దీపావళికి ఆమె తల్లిదండ్రులకు దూరంగా సెట్స్ పైనే గడపనున్నారు. ఓ ఇంటర్వ్యూలో రాశీ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం దీపావళిని ఇంట్లో కుటుంబసభ్యులతో జరుపుకోవడం తనకెంతో ఇష్టమని చెప్పారు. లక్ష్మీగణపతి పూజ, తల్లి చేసే పాయసం, కజిన్స్ తో సరదాలు… ఇలా దీపావళి పండుగను బాగా ఆస్వాదిస్తానని తెలిపారు.అయితే ఈసారి షూటింగ్ కోసం చెన్నైలో ఉన్నానని, ఇంటికి వెళ్లే అవకాశం ఉన్నా, కరోనా పరిస్థితుల్లో ఆ నిర్ణయం వాయిదా వేసుకున్నానని వెల్లడించారు. బయట పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణాలు చేసి తల్లిదండ్రులను రిస్క్ లోకి నెట్టలేనని వివరణ ఇచ్చారు. ఈసారి పండుగను చిత్రబృందంతో కలిసి షూటింగ్ స్పాట్ లోనే జరుపుకుంటానని రాశీ అన్నారు. యూనిట్ సభ్యులందరం కలిసి పూజ చేసి ఆపై దీపాలు వెలిగించాలని నిర్ణయించుకున్నామని, ఆపై సంప్రదాయ వంటకాలతో భోజనం చేస్తామని చెప్పారు.ఇక, లాక్ డౌన్ తర్వాత షూటింగ్ లో పాల్గొనడం కొంత ఆందోళన కలిగించిందని, సెట్లో ఒక్కసారిగా పాతికమందిని చూశాక కంగారు పడ్డానని వివరించారు. అయితే కెమెరా ముందుకు వెళ్లాక భయాలన్నీ తొలగిపోయాయని తెలిపారు.