ఇటీవలే తిరిగి మొదలైన ‘ఆచార్య’ షూటింగ్

ఇటీవలే తిరిగి మొదలైన ‘ఆచార్య’ షూటింగ్

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ షూటింగులో పాల్గొనడానికి రెడీ అవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగు లాక్ డౌన్ కి ముందు కొంత భాగం జరిగింది. అయితే, లాక్ డౌన్ కారణంగా ఏడు నెలల పాటు ఆగిపోయింది. ఇటీవలే చిత్రం షూటింగును హైదరాబాదులో ప్రారంభించారు. చిరంజీవి కూడా ఈ షూటింగులో అప్పుడే జాయిన్ కావలసివున్నప్పటికీ, ఆయనకు కొవిడ్ పాజిటివ్ రిపోర్ట్ రావడంతో హోమ్ క్వారంటైన్ కి వెళ్లారు. అయితే, రెండు రోజుల తర్వాత మళ్లీ ఆయన రెండు మూడు చోట్ల టెస్ట్ చేయించుకోగా నెగటివ్ రావడం.. దీంతో అసలు ఆయనకు కరోనానే సోకలేదనీ, తొలి టెస్టులో ఏదో పొరపాటు జరిగి ఉంటుందనీ డాక్టర్లు అభిప్రాయపడినట్టు స్వయంగా చిరంజీవే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20 నుంచి ఆయన ‘ఆచార్య’ షూటింగులో చేరడానికి సిద్ధమవుతున్నట్టు తాజా సమాచారం. మరోపక్క, చిరంజీవి లేని సన్నివేశాలను ఇతర నటీనటులపై ఇప్పటికే చిత్రీకరిస్తున్నారు. ఇక బ్రేక్ లేకుండా సింగిల్ షెడ్యూల్ లో షూటింగును పూర్తిచేసేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కథానాయిక కాజల్ అగర్వాల్ కూడా వచ్చే నెల 5 నుంచి ఈ చిత్రం షూటింగులో పాల్గొంటుంది.