మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం..

మద్యం మత్తులో యువకులు కారును వేగంగా నడుపుతూ ఓ ఇంటి పైకి దూసుకెళ్లిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అల్వాల్ లోని గ్రీన్ ఫీల్డ్స్ కాలనీలో నివాసం ఉంటున్న యువకులు మద్యం దుకాణాలు తెరవడంతో ఫుల్లుగా తాగి కారు నడుపుతూ హల్ చల్ చేశారు. నాగిరెడ్డి కాలనీలో ఒక ఇంటి గోడ పైకి కారు దూసుకుని వచ్చింది. మద్యం మత్తులో ఉండడంతో యువకులు వేగంగా కారు నడుపుతూ ఇంటి గోడలు ధ్వంసం చేశారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో నాగిరెడ్డి కాలనీవాసులు అంతా ఉలిక్కిపడ్డారు. స్థానికులు బయటకు వచ్చి చూడగా కారు ప్రమాదానికి గురైన విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మద్యం మత్తులో ఉన్న యువకులు కారులో నుండి పరారయ్యారు. ప్రమాదం జరిగిన చోట మద్యం బాటిల్లు లభించాయి. ఇంటి గోడను ఢీకొట్టడంతో తృటిలో ప్రమాదం తప్పింది.