కరోనా వారియర్స్ త్యాగానికి పూలాభిషేకం

కోవిడ్ -19 మహమ్మారిపై పోరాడడంలో కరోనా వారియర్స్, తిరుగులేని పాత్ర‌,వారి త్యాగానికి కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు వందనాలు అర్పించారు. ఇందుకు సంబంధించి అమిత్ షా ఒక ట్వీట్ చేస్తూ,”భారతదేశం తన వీరోచిత కరోనా యోధులకు నమస్కరిస్తోంది. శ్రీ న‌రేంద్ర మోడీ ప్రభుత్వం, దేశం మొత్తం మీ వెంట‌ ఉన్నాయని నేను మీకు భరోసా ఇస్తున్నాను. సవాళ్లను అవకాశాలుగా మార్చడం ద్వారా మనం కరోనా నుండి దేశాన్ని విముక్తి చేయాలి. ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన, బలమైన భారతదేశాన్ని సృష్టించడం ద్వారా ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలుద్దాం. జై హింద్! ”

కరోనా యోధులను భారత సాయుధ దళాలు వివిధ మార్గాల్లో ఈరోజు సత్కరించాయి. దీనిని హోంమంత్రి ప్రశంసించారు. “కరోనా నుండి దేశాన్ని విముక్తి చేయడానికి రాత్రింబ‌గ‌ళ్లు పనిచేస్తున్న‌ వైద్యులు, పోలీసులు, పారా మిలటరీ దళాలు ఇతర యోధుల పట్ల భారత సాయుధ దళాలు చూపిన గౌరవం, అందుకు సంబంధించిన‌ దృశ్యాలు, హృద‌యాన్ని పుల‌కింప చేస్తున్నాయి.. కరోనాతో పోరాడుతూ ఈ యోధులు చూపిన ధైర్యం ఖచ్చితంగా గౌరవింప‌ద‌గిన‌ది.

కరోనా మహమ్మారితో పోరాడుతున్న అస‌మాన యోధుల‌కు భారత సాయుధ దళాలు ఈరోజు నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద పుష్పాలు స‌మ‌ర్పించి వంద‌నం చేశాయి. దీనిపై అమిత్ షా ఒక ట్వీట్ చేస్తూ,.”కరోనావైరస్ పై భారతదేశం పోరాటం నిజంగా ప్రశంసనీయం. ఈ రోజు మూడు సాయుధ దళాలు నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద ఈ వ్యాధిపై పోరాడుతున్న అస‌మాన యోధుల‌కు పుష్పాల‌తో వంద‌నం చేశాయి. ఈ కష్ట సమయంలో దేశం మొత్తం ఈ అస‌మాన యోధులు వారి కుటుంబాల వెంట‌ నిలుస్తుంది. ”