అమెరికా వద్దు భారతే ముద్దు… ఎందుకు??

భార‌త్‌ కరోనాతో కకావికలం అవుతుందని మాట్లాడిన నోళ్లే ఇవాళ నోరెళ్ల‌ బెట్టి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అంతే కాదండోయ్ హైడ్రాక్సీక్రోలోక్విన్‌ మందు కోసం ప్ర‌పంచంలోని ముప్పై పైగా దేశాలు మ‌న‌దేశం చుట్టూ ప్రదక్షిణలు, భారతీయుల్లారా కరుణించండి అంటూ చేయి చాపుతున్నాయి. ఈ దేశాల్లో అగ్ర‌రాజ్యం అమెరికా ముందుంటే బ్రెజిల్, యూరప్, ఆసియా దేశాలు క్యూలోన్నాయి.

మ‌‌న దేశ జ‌నాభా దాదాపు 130 కోట్లు ప్రపంచంలోనే అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశాల‌లో‌ చైనా త‌ర్వాత స్థానం మ‌న‌దే. మ‌హా న‌గ‌రాల నుంచి మొద‌లుకుని మన పల్లెల వ‌ర‌కు జ‌నాభా కిక్కిరిసి ఉంటుంది. ఇరుకు ఇళ్లలోనే కోట్లాది మంది నివాసం ఉంటున్నారు. ఏదైనా జ‌ర‌గ‌రాని విప‌త్తు సంభ‌విస్తే ప్రాణ‌ న‌ష్టం మ‌న‌దేశంలోనే ఎక్కువ‌గా ఉంటుంద‌ని బ‌య‌టిదేశాలు అనుకునే మాట‌. మ‌న సంస్కృతి, సంప్ర‌దాయం, క‌ట్టుబాట్లు, ఆచార వ్య‌వ‌హారాలు అన్నీ విదేశీయుల‌కు విచిత్ర‌మే. విదేశీ ప‌ర్యాట‌కులు మ‌న జీవ‌న విధానంపై, సంస్కృతి ఆచారాల ఫోటోలతో పాటు అక్కడక్కడ ఉన్న పారిశుద్యం , మురికివాడ‌ల ప్ర‌జ‌లు, పేద‌ల క‌ష్టాల‌ను త‌మ కెమెరాల్లో బందిస్తూ గొప్ప‌గా ఫీల్ అవుతుండడం మ‌నం చూస్తూనే ఉంటాం. కానీ ఆ విదేశీయుల‌కు ఏమి తెలుసు మ‌నలో ఉన్న ఐక్య‌త‌. క‌ష్టాల క‌డ‌లిలో చేయి చేయి క‌లిపి ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తామని. 130 కోట్ల జ‌నాభా క‌లిగిన భార‌తీయులు ఎంత‌టి విప‌త్క‌ర ప‌రిస్థితులైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉంటార‌ని క‌రోనా వైర‌స్ యుద్దం ద్వారా ప్రపంచ దేశాలకు బోధ ప‌డుతోంది.

ప్ర‌పంచ వ్యాప్తంగా చైనా ఊహాన్ కేంద్రంగా విస్త‌రించిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచంలోని 209 దేశాల‌ను చుట్టుముట్టింది. తాజా స‌మాచారం మేర‌కు ఇప్ప‌టి వ‌ర‌కు 15ల‌క్ష‌ల మందికి పైగానే క‌రోనా వైర‌స్ సోకగా 89వేల మంది వరకు మృత్యువాత‌ ప‌డ్డారు. అయితే ఈ సంఖ్య భారీగానే పెరిగెట్టు తెలుస్తోంది. దాదాపు 3.31 ల‌క్ష‌ల మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. క‌రోనా వైర‌స్ ధాటికి ధ‌నిక‌, పేద‌, రాజు, మంత్రులు తేడా లేకుండా ఎంత‌టివారైనా వ్యాధి తీవ్ర‌తైతే మృత్యు ఒడిలోకి చేర‌డం ఖాయం. ఇలాంటి ఉదాంతాలు స్పెయిన్ దేశంలో యువరాణి మృతి, బ్రిటన్ ప్రధానమంత్రి ICUలో వైద్యం లాంటివి చూస్తూనే ఉన్నాం.

క‌రోనా వైర‌స్ విజృంభ‌న‌తో అగ్ర‌రాజ్యం అమెరికా అధోగతిపాలవుతోంది. మ‌న దేశంతో పోలిస్తే వైశాల్యంలో ఎక్కువే అమెరికా. కానీ జ‌నాభా విష‌యానికి వ‌స్తే మ‌న జ‌నాభా 130 కోట్లు పైమాటే.. అమెరికా జ‌నాభా 35 కోట్లు మాత్ర‌మే. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన అగ్ర‌రాజ్యం, సంప‌న్న దేశంగా అలరారుతోంది, ప్ర‌పంచ దేశాల‌కు పెద్ద‌న్న‌గా జబ్బులు చ‌రుచుకునే అమెరికాను సైతం క‌రోనా వైర‌స్ వెన్నులో వ‌ణుకుపుట్టిస్తోంది. 35 కోట్ల జ‌నాభాను నియంత్రించ‌లేక రోజు రోజుకు పెరుగుతున్న క‌రోనా కేసుల‌తో అధ్య‌క్షుడు ట్రంప్‌తో పాటు అక్క‌డి పాల‌కుల‌కు కంటి మీద కునుకులేకుండా పోతోంది. క‌రోనావైర‌స్ సంక్ర‌మించిన వ్యక్తులకు వైద్యం చేయ‌డానికి సరిపోయే ఆస్పత్రులు, వైద్యులు స‌రిపోవ‌డం లేదు. వైద్యుల‌కు ప‌రికరాల కొర‌త స‌మ‌స్య‌గా మారింది. క‌రోనా వైర‌స్ మృతుల‌కు స్మశానాల్లో స్థ‌లం క‌రువైంది. మృత‌దేహాల‌ను పూడ్చ‌టానికి మ‌నుషులు దొర‌క‌డం లేదు. ప‌బ్లిక్ పార్కుల‌ను స్మ‌శానాల‌నుగా వినియోగించుకునే దుస్థితిలోకి అమెరికా దిగజారిపోయింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా స్వైర‌ విహారం చేస్తూ ల‌క్ష‌లాది మందిని అనారోగ్యులుగా మారుస్తూ వేలాది మంది ప్రాణాల‌ను హ‌రిస్తున్న క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి విష‌యంలో భార‌త్ తీసుకుంటున్న చ‌ర్య‌లు ప్ర‌పంచ దేశాల‌కు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. 130 కోట్ల జ‌నాభా ఉన్న భార‌తదేశంలో
క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఊహించినంత‌గా లేక‌పోవ‌డం
ప్ర‌జ‌ల్లోని ఐక్య‌త‌, సంయ‌మ‌నం, సహనం, స‌మ‌న్వ‌యానికి నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. అమెరికా, ఇట‌లీ, స్పెయిన్, బ్రిటన్, చైనాలతో పాటు అభివృద్ధి చెందిన దేశాల‌తో పోలిస్తే మ‌న దేశంలో వైద్య స‌దుపాయాలు అంతంత మాత్ర‌మే. కానీ లాక్‌ డౌన్ అమ‌లుతో క‌రోనా వైర‌స్‌ను నిలువ‌రిస్తున్నాం. భార‌త దేశంలో ఇవాళ్టీ వ‌ర‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించిన వ్యక్తుల సంఖ్య 5734కు చేరువవుతుండగా, చ‌నిపోయిన వారి సంఖ్య 169కు చేరింది. క‌రోనా వైర‌స్ ద్వారా కోలుకున్న‌ వ్యక్తుల సంఖ్య 506కు చేర‌డం ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించ‌డంలో ప్ర‌జ‌ల్లో ఉన్న ఐక్య‌త‌, పాల‌కుల ప‌నితీరుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది.

మన భారతదేశ సంస్కృతి:
మనం పురాతన సనాతన ధర్మాన్ని నమ్ముతాం. ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో మెలగాలని కోరుకుంటాం. పురాతన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ప్రేమ, ఆప్యాయతలు, పూజలు, పునస్కారాలు, పద్ధతులు, సహాయ సహకారాలు, కుటుంభ వ్యవస్ధ, చదువు, సంస్కృతులు మన భారతీయుల ప్రత్యేకతలు. కరోనా కట్టడిలో మనం ఎదుర్కోంటోన్న సవాళ్లు? మనకు ఎందుకు ఈ పరిస్థితులు? అన్నప్పుడు ఇవన్నీ గుర్తుకు వస్తాయి.

మనది కర్మభూమి జై ప్రభుత్వ ఉద్యోగి
ఈనాటికీ మనం కర్మభూమి సిద్దాంతం నమ్ముతాం కాబట్టి మన దేశములోని వైద్యులు, పోలీసులు, వైద్య సిబ్బంది, రెవెన్యూ విభాగం, మున్సిపాలిటీ, విద్యుత్, జల సరఫరా ఒక్కటేంటి పేరుపేరునా అన్ని విభాగాలు కరోనాకు కనీసం ఓ ఇంచు కూడా భయపడకుండా మన సమాజం, దేశ శ్రేయస్సు కోసం 24/7 ఆహార్నిశలు కృషి చేస్తున్నాయి. మనం ఇన్నాళ్లు చులకనగా మాట్లాడిన, తీసేసిన ప్రభుత్వ ఉద్యోగులే నేడు మనకు శ్రీరామ రక్షగా సేవలు అందిస్తున్నారు. లాక్-డౌన్ ప్రకటించి వారం పూర్తయినప్పటికి ఓ చిన్న అత్యవసరానికి కూడా కొరత లేకుండా, కాకుండా ఇంట్లోనే కాలు మీద కాలేసుకుని వేసవి సెలవుల్లా ఎంజాయ్ చేస్తున్నామంటే, దీనికి కారణం మనకు ఇబ్బంది కలగకుండా మనకు సేవకు చేస్తోన్న ప్రతి ఒక్క సేవకుడికి మనం తలవంచి నమస్కరించాల్సిందే, సెల్యూట్ చేయాల్సిందే. ఎందుకంటే మనం మన గడప దాటితే ఏమవుతుందో ఆందోళన, భయం వెంటాడుతోంది అలాంటిది మన ప్రభుత్వము, స్వచ్చంద వ్యవస్థలు అన్ని కంటి మీద కునుకు లేకుండా 24/7 రోడ్లపై పడిగాపులు గాస్తూ మన సమాజం, దేశ రక్షణలో భాగస్వాములు అవడం భారత దేశ గొప్పతనం, భిన్నత్వంలో ఏకత్వం, ఔనత్యానికి, సుగుణాలకు నిదర్శనం. నాడు జై జవాన్-జై కిసాన్ నినాదం నేడు జై ప్రభుత్వ ఉద్యోగి జై జై ప్రభుత్వ ఉద్యోగి అనాల్సిందే. దేశంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అందిస్తోన్న సేవలు అనిర్వచనీయం.
ఏప్రిల్ 09.04.2020 నాటికి లాక్ డౌన్, విద్యుత్, తాగునీరు, పరిశుభ్రత, వైద్యం, నిత్యావసరాలు, రక్షణ సేవల్లో ఎక్కడా కూడా వెల్తీ లేకుండా మెరుగైన సేవలు అందిస్తున్నారు.

మనది కర్మ భూమి వసుధైక కుటుంభం. మనమంతా ఎప్పుడు జనం మనం అంటూ కోరుకునే సమాజంలో జీవిస్తున్నాము స్వల్ప లోపాలున్నప్పటికి విశ్వంలోనే మన భారతీయులంటే తరతరాలుగా ఓ ప్రత్యేకత ఉంది.