కరోనా టెలిఫోన్ బూత్ టెస్ట్: SCTIMST

*కోవిడ్‌-19 రోగుల పరీక్ష కోసం శాస్త్రవేత్తల వినూత్న ఆవిష్కరణ.
*టెలిఫోన్‌ బూత్‌ వంటి వ్యాధివ్యాప్తి నిరోధక గదికి SCTIMST రూపకల్పన.
*తాకకుండానే పరీక్షించే వీలు – రోగి వెళ్లాక యూవీ లాంప్‌తో బూత్‌ ప్రక్షాళన.
*ముందుచూపుతో రూపొందించిన ఉపకరణం: DST కార్యదర్శి అశుతోష్‌ శర్మ.

భారత ప్రభుత్వం శాస్త్ర-సాంకేతిక విభాగం (DST) కింద కేరళలోని త్రివేండ్రంలో స్వయం ప్రతిపత్తి గల ‘శ్రీ చిత్ర తిరునాళ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ’ (SCTIMST) కోవిడ్‌-19 రోగులను పరీక్షించేందుకు వినూత్న ఉపకరణాన్ని ఆవిష్కరించింది. రోగుల నుంచి డాక్టర్లకు వైరస్‌ సోకకుండా ఈ సంస్థ శాస్త్రవేత్తలు టెలిఫోన్‌ బూత్‌ తరహాలో వ్యాధి వ్యాప్తి నిరోధక గదిని రూపొందించారు.

ఈ టెలిఫోన్ బూత్ లాంటి గదిలో ఓ సాధారణ లైటు, 254 నానోమీటర్ల తరంగదైర్ఘ్యం (వేవ్‌లెంగ్త్‌) గల 15వాట్ల అతినీల లోహిత (UV) బల్బ్‌, టేబుల్‌ ఫ్యాన్‌, ర్యాక్‌ ఉంటాయి. ఈ బూత్‌కు ఒకవైపుగల ద్వారం నుంచి రోగి లోనికి ప్రవేశిస్తారు. రెండోవైపున చేతులు మాత్రమే పట్టే రెండు మార్గాలుంటాయి. వీటిలో ఒకదాని నుంచి గ్లోవ్స్‌ తొడుక్కున్న చేతిని, రెండో మార్గం నుంచి స్టెత్‌స్కోప్‌ను డాక్టర్లు లోనికి చాపి రోగిని పరీక్షిస్తారు. ఆ తర్వాత ప్రతి రోగి బయటకు వెళ్లగానే- బూత్‌లోని UV లైట్‌ ఆన్‌ చేస్తారు. దీంతో బూత్‌లో వైరస్‌ సముదాయం ఉంటే 3 నిమిషాల్లో పూర్తిగా నాశనమైపోతుంది. అనంతరం మరొక రోగిని లోనికి అనుమతిస్తారు. “రోగులకు ప్రత్యక్ష సేవలందించే డాక్టర్లకు, ఇతర సిబ్బందికి పూర్తి భద్రతనిచ్చేలా ఎంతో ముందుచూపుతో శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు” అని డీఎస్టీ కార్యదర్శి ప్రొఫెసర్‌ అశుతోష్‌ శర్మ ఈ సందర్భంగా అభినందించారు.