కరోనా విరాళాల సేకరణకు శ్రియా శ్రీకారం

రెండు సంస్థలతో కలిసి పనిచేస్తున్న శ్రియ
రూ. 200 చెెల్లిస్తే రిజిస్ట్రేషన్
తనతో డ్యాన్స్, యోగా చేయవచ్చని సూచనవిపత్కర పరిస్థితుల్లో సినిమా నటులు తమ వంతు సాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఈ కోవలోనే భర్త ఆండ్రీతో కలిసి స్పెయిన్‌లో నివసిస్తున్న నటి శ్రియ విరాళాల సేకరణకు వినూత్నానికి శ్రీకారం చుట్టారు. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన శ్రియ ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా రూ.200 చెల్లించి తనతో కలిసి డ్యాన్స్, యోగా చేయవచ్చంటూ ఆఫర్ ప్రకటించారు. శనివారం సాయంత్రం వరకు మాత్రమే ఈ అవకాశం అందుబాటులో ఉన్నట్టు తెలిపారు.

కోవిడ్ బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు ‘ది కైండ్‌నెస్ ఫౌండేషన్, చెన్నై టాస్క్‌ఫోర్స్ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పిన శ్రియ.. దినసరి కూలీలు, నిరాశ్రయులైన వృద్ధులు, వికలాంగులు, అనాథల కోసం విరాళాలు సేకరించబోతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరు విజేతలను ఎంపిక చేస్తామని, వారు తనతో కలిసి డ్యాన్స్, యోగా చేయొచ్చని వివరించారు. ఇందుకోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.దికైండ్‌నెస్‌ప్రాజెక్ట్.ఇన్ (www.thekindnessproject.in)లో రూ.200 విరాళంగా చెల్లించి రిసిప్ట్‌ను ఈమెయిల్ చేయాలని శ్రియ పేర్కొన్నారు. ఈ నెల 9 వ తేదీ , శనివారం సాయంత్రం 8 గంటల వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని, ఆదివారం విజేతల్ని ప్రకటించి, వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఒక మంచి పనికోసం అందరం కలిసి రావాలని శ్రియ పిలుపునిచ్చారు.