సితార్ విద్వాంసుడు దేవబ్రత చౌదరి కన్నుమూత

సితార్ విద్వాంసుడు దేవబ్రత చౌదరి కన్నుమూత

కరోనా ధాటికి మరో ప్రముఖుడు నేలరాలారు. ప్రసిద్ధ సితార్‌ విద్వాంసుడు దేవబ్రత చౌదరి (85) మృతిచెందారు. తన తండ్రి మరణించినట్టు ఆయన కుమారుడు ప్రతీక్‌ చౌదరి సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.ఇటీవల దేవబ్రతకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ కావడంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతున్న ఆయనలో ఆక్సిజన్‌ స్థాయిలు శుక్రవారం ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో పరిస్థితి విషమించి శుక్రవారం-శనివారం మధ్య రాత్రి తుదిశ్వాస విడిచారు. సంగీత ప్రపంచానికి పండిత్‌ దేవబ్రత చౌదరి అరవై ఏళ్ల పాటు విశేష సేవలందించారు. ఆయనను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్‌, సంగీత నాటక అకాడమీ వంటి అవార్డులతో సత్కరించింది. ఆయన మృతిపట్ల పలువురు సంగీత విద్వాంసులు, బాలీవుడ్‌, రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.