పొగరాయుళ్ళకు కరోనా ముప్పు అధికం, ప్రవర్తన మార్చుకోవాలంటున్న WHO, వైద్యనిపుణులు.
పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్ అంటాడు ‘కన్యాశుల్కం’లో గిరీశం. పొగ తాగేవారు తమను తాము సమర్థించుకునే మాట ఇది. నిజానికి పొగతాగడం అంటే జీవితానికి పొగ పెట్టుకోవమే. ఊపిరితిత్తులు, గుండె, రక్తనాళాలను దెబ్బతీస్తూ ప్రాణాలను హరిస్తోంది. అయితే తాజాగా పొగరాయుళ్లకు కరోనా వైరస్ మహామ్మారి ముప్పు అధికమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతుండటం గమనార్హం.
సిగరెట్లు ధరలు పెంచి బ్లాకులో అమ్మకాలు
కరోనా వైరస్ వ్యాప్తితో ఆయా ప్రాంతాల్లో సిగెరెట్ల లభ్యం కావడం లేదు. ఎందుకంటే ఎక్కడికక్కడ అన్నీ మూతపడటంతో పొగరాయుళ్లకు ఊపిరాడటం లేదు. రోజుకు లెక్కలేనన్ని సిగరెట్లు కాల్చే వారికైతే కునుకే కరువైంది. దీంతో రెట్టింపు ఖర్చు పెట్టి మరీ సిగరెట్లు కొనేందుకు బయటికొస్తుండటంతో బ్లాక్ మార్కెట్ పెరిగింది. ఈ ధూమపానంతోనే అసలు సమస్య ఏర్పడుతోందంటున్నారు వైద్య నిపుణులు. పొగతాగే అలవాటున్న వ్యక్తులకు కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో వెల్లడించింది.
ప్రవర్తన మార్చుకోండిలా..?
కరోనా కట్టడి కోసం దేశమంతా లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ 21 రోజులకు మానసిక శాస్త్రంలో, సనాతన ధర్మంలో అర్ధమండలంగా కొన్ని విశేషాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా సంకల్పించినపుడు దాన్ని సాధించేందుకు 21 రోజులు కఠినంగా సాధన చేస్తే తప్పకుండా అనుకున్నది నెరవేరుతుందంటున్నారు. ఈ సమయంలోనే చెడు అలవాట్లకు పూర్తిగా దూరం కావడానికీ ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. ఇలా పొగాకు తీసుకోవడం మానేసిన కొద్దినెలలకే శ్వాసకోశ సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మీరు ఆచరించి పాటించండి. ఆయారారోగ్యమస్తు.
సిగరెట్ల సెర్చ్ చేస్తోన్న పొగరాయుళ్లు
అన్ని నగరాలు, పట్టణాల్లో ఎక్కడికక్కడ దుకాణాలు, చిల్లర అంగళ్లు మూసేయడంతో పొగాకు అలవాటుపడ్డ వ్యక్తులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇదే అదనుగా అక్రమంగా కొందరు ప్రత్యేక వాహనాల్లో హుక్కా బాటిళ్లను తరలిస్తున్నారు. ఇందుకు మత్తు బాబుల నుంచి ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఇటీవలే నగరంలో సంచార హుక్కాకేంద్రం ఒకటి పోలీసులకు చిక్కడం ఇందుకు నిదర్శనం. బాబోయ్ మీకు చెబితే అర్థం కావడం లేదు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు పెద్దలు ఏమి చెబితే ఆర్థమవుతుందో భగవంతునికే తెలియాలి.
కరోనా వైరస్ వ్యాప్తి ఇలా..?
పొగతాగే వారిలో కరోనా వ్యాపించే అవకాశాలు 14రెట్లు ఎక్కువని చెబుతోన్న WHO అందుకు కొన్ని కారణాలను కూడా తెలిపింది. చేతులతో ముక్కు, నోరు, కళ్లను తాకడంతో కరోనా వైరస్ వ్యాపిస్తుందనే విషయం తెలిసిందే. పొగరాయుళ్లు చేతివేళ్లను ప్రతిసారీ నోటి వద్దకు తీసుకెళుతుంటారు. దీంతో వైరస్‌కు స్వాగతం పలుకుతున్నట్లే. కొన్నిరకాల ధూమపాన సాధనాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటుంటారు. ఇలా వైరస్ వ్యాపించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయంటున్నారు. పొగాకు శ్వాసకోశ వ్యవస్థను బలహీనపరుస్తుంది. దీంతో వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో పొగరాయుళ్లకు హెచ్చరికలు జారీ చేస్తుంది. ధూమపానం ప్రియులు, పొగరాయుళ్లరా తస్మాత్ జాగ్రత్త కరోనా మీ చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా చూసుకోగలరు.