పార్కుల్లో ప్రత్యేక సౌకర్యాలు

పార్కుల్లో ప్రత్యేక సౌకర్యాలు

జాతీయ పార్కులు, అటవీ ఉద్యాన వనాలను సందర్శించే పర్యాటకులకు తగిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతికుమారి అధికారులను ఆదేశించారు. అహ్లాదాన్ని పంచటంతో పాటు, పర్యావరణ ప్రాధాన్యత తెలిసేలా కార్యక్రమాలు ఉండాలన్నారు. మృగవని జాతీయ ఉద్యానం వనం (చిలుకూరు), షామీర్ పేట జింకల పార్కును శాంతికుమారి సందర్శించారు. ఈ రెండు ప్రాంతాల్లో అటవీ భూములు, నర్సరీలు, పునరుద్దరణ పనులతో పాటు, సందర్శకుల సౌకర్యాలు, జంతువుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఏకో టూరిజం అభివృద్ధికి పలు సూచనలు చేశారు.

శరవేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ కు ఔటర్ రింగు రోడ్డు వెంట వేలాది ఎకరాల అటవీ భూములు ఉన్నాయని, వీటిల్లో అటవీ పునరుద్దరణ పనులకు తోడు, సందర్శకులను అనుమతించిన పార్కులు పార్కులు, ప్రాంతాల్లో తగిన సౌకర్యాలు ఉండాలన్నారు. మృగవని నేషనల్ పార్కుకు వస్తున్న సందర్శకుల సంఖ్య, వసతులు, సఫారీలను పరిశీలించారు. ఐ.టీ కారిడార్ నుంచి వచ్చే ఉద్యోగులు, విద్యార్థులకు పర్యావరణం పట్ల అవగాహన పెరిగేలా కొత్త తరహా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. నేచర్ ట్రయల్స్, టెక్కింగ్, సైక్లింగ్, బర్డ్ వాచింగ్ లాంటి కార్యక్రమాలను సంబంధిత స్వచ్చంద సంస్థలతో కలిసి నిర్వహించవచ్చని తెలిపారు. చిలుకూరు సర్సరీని సందర్శించి, అక్కడ పెంచుతున్న మొక్కల రకాలపై ఆరాతీశారు. ఆ తర్వాత శామీర్ పేటలో ఉన్న జింకల పార్కును అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడి జంతువులకు తగిన విధంగా ఆహారం అందుతుందా, గడ్డి క్షేత్రాల పెంపుపై పలు సూచనలు చేశారు. తెలంగాణకు హరితహారం ద్వారా ప్రజల్లో పర్యావరణం, అడవుల రక్షణపై మంచి అవగాహన వచ్చిందని, ప్రకృతికి ఎలాంటి హానీ జరగకుండా నిర్వహించే పర్యావరణహిత కార్యక్రమాల వల్ల మరిన్ని మంచి ఫలితాలు సాధించవచ్చని, ఆదిశగా ప్రయత్నాలు చేయాలని అటవీ శాఖ అధికారులకు తెలిపారు. అటవీ ప్రాంతాల రక్షణ, క్రమణలకు గురికాకుండా తీసుకున్న చర్యలను పరిశీలించి, రెండు ప్రాంతాల్లోనూ ఆమె మొక్కలు నాటారు. స్థానిక పరిసరాలకు తగిన మొక్కలను నాటి పెంచటం ద్వారా అటవీ ప్రాంతాల సహజవృద్దికి అవకాశం ఉంటుందని తెలిపారు. అటవీ అభివృద్ది సంస్థ భాగస్వామ్యంతో నడుస్తున్న మృగవని, అరణ్య రిసార్టులను అధికారులు పరిశీలించారు. పర్యాటకులకు అందుతున్న సౌకర్యాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో అటవీ అభివృద్ది సంస్థ వైస్ చైర్మన్, ఎం.డీ జీ. చంద్రశేఖర రెడ్డి, హైదరాబాద్ , రంగారెడ్డి చీఫ్ కన్జర్వేటర్లు ఎం.జే. అక్బర్, సునీతా భగవత్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.