టీఆర్ఎస్-ఎంఐఎం పొత్తుపై ఊహాగానాలు

టీఆర్ఎస్-ఎంఐఎం పొత్తుపై ఊహాగానాలు

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యాన్ని ఇవ్వలేదన్న విషయం తెలిసిందే. అధికార టీఆర్‌ఎస్ మేయర్ పీఠానికి పది సీట్ల దూరంలో నిలిచింది. 65 స్థానాలు వస్తే టీఆర్‌ఎస్‌కు మేయర్‌ పీఠం దక్కేది. టీఆర్ఎస్ 55 స్థానాల్లో గెలవగా, ఆ పార్టీ ఆధిక్యంలో ఉన్న మరో స్థానం నేరేడ్‌మెట్లో ఫలితం వెల్లడి కావాల్సి ఉంది.అయితే, టీఆర్ఎస్ ఖాతాలోని ఎక్స్ ‌అఫీషియో ఓట్లపై ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల బరిలో అన్ని ప్రధాన పార్టీలు ఎవరితోనూ పొత్తులు లేకుండా సొంతంగా పోటీ చేశాయి. టీఆర్ఎస్, ఎంఐఎం విడిగా పోటీ చేసినప్పటికీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్‌కు ఆధిక్యం రాకపోవడంతో ఆ రెండు పార్టీలు కలిసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో దీనిపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు.వరంగల్ నగర పాలక సంస్థ ట్రాక్టర్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ… ఎంఐఎంతో పొత్తు లేకుండానే గ్రేటర్ పఠం దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం సందర్భంగా విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ, ఎంఐఎం లబ్ధిపొందాయని ఆయన తెలిపారు.