మంచిర్యాల జిల్లాలో నాటుమందు ఇస్తున్న బచ్చలి భీమయ్య

మంచిర్యాల జిల్లాలో నాటుమందు ఇస్తున్న బచ్చలి భీమయ్య

ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఆనందయ్య ఇస్తున్న కరోనా నాటుమందుకు ఎంత పబ్లిసిటీ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లు కూడా ఆయన మందుకోసం పరుగులు పెట్టారు. ఒకే రోజు దాదాపు 50 వేల మంది ఆయన మందు తీసుకోవడానికి పడిగాపులు కాశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఓ నాటు వైద్యుడు కరోనాకు మందు ఇవ్వడం మొదలు పెట్టారు.మంచిర్యాల జిల్లా మందమర్రి గ్రామానికి చెందిన బచ్చలి భీమయ్య అనే వ్యక్తి కరోనాకు నాటుమందు ఇస్తున్నారు. గతంలో సింగరేణి కార్మికుడిగా పని చేసిన ఆయన పదవీ విరమణ పొందారు. తాజాగా ఆయన మాట్లాడుతూ… ఇప్పటి వరకు 300 మంది కరోనా పేషెంట్లను తన మందుతో ఆరోగ్యవంతుల్ని చేశానని తెలిపారు. ప్రభుత్వం అనుమతిస్తే మందును పెద్ద మొత్తంలో తయారు చేస్తానని చెప్పారు. కేవలం రెండు గంటల్లోనే కరోనాను నయం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.వనమూలికలతో మందు తయారు చేసే జ్ఞానం తనకు వంశపారంపర్యంగా వచ్చిందని బచ్చలి భీమయ్య తెలిపారు. తన తాత దగ్గర నుంచి తాను వైద్యం గురించి తెలుసుకున్నానని చెప్పారు. 13 వనమూలికలతో తయారు చేసిన మందు కరోనా వ్యాధిగ్రస్తులకు బాగా పని చేస్తుందని అన్నారు. మరోవైపు భీమయ్య ఇస్తున్న మందు గురించి పోలీసులకు సమాచారం అందింది. ఈ సందర్భంగా మందమర్రి సీఐ ప్రమోద్ రావు మాట్లాడుతూ… ఆయన మందుకు ఎలాంటి శాస్త్రీయత లేదని చెప్పారు. ఆ మందును వాడి ప్రజలు రిస్క్ తీసుకోవద్దని హెచ్చరించారు.