ఈ సిక్కోలు మహిళ రైతులకు ఆదర్శం -అడవిలో ఆణిముత్యం

ఈ సిక్కోలు మహిళ రైతులకు ఆదర్శం -అడవిలో ఆణిముత్యం

ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ గిరిజన మహిళ పడాల భూదేవి దేశవ్యాప్తంగా సత్తాచాటాలు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆమె నారీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు. తన తోటి గిరిజన మహిళలకు పోడు వ్యవసాయంలో మెళకువలను నేర్పించడం, వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడం, వితంతువులకు వ్యవసాయంపై సమగ్ర అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఆమె ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు. గ్రామీళ మహిళా రైతులకు వ్యవసాయంలో ఎన్నో మెళకువలు నేర్పారు. శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన మహిళ భూదేవి. ఆంధ్ర ప్రదేశ్ నుంచి పడాల భూదేవి ఒక్కరే ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
గిరిజన మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడానికి ఆమె ప్రత్యేకంగా చిన్మయ ఆదివాసీ వికాస్ సొసైటీని నెలకొల్పారు.దీనికింద ఆమె పలు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రస్తుతం పడాల భూదేవి.. మన్యం గ్రెయిన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మన్యదీపిక ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌ సంస్థలకు డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కనీస వైద్య సదుపాయానికి నోచుకోని గిరిజన మహిళలు, వారి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడానికి నిరంతరాయంగా కృషి చేశారు. ఐటీడీఏ సహకారంతో ఏజెన్సీ ప్రాంతాల్లో మహిళలు, శిశువుల సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

సీతంపేటకు చెందిన ఈమెకు 11 సంవత్సరాల వయసులోనే పడాల భూదేవికి వివాహమైంది. భర్త, అత్తమామల నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా, భర్త వదిలేసినా పట్టించుకోకుండా ముందుకు సాగారు. ముగ్గురు ఆడపిల్లలకు ఉన్నత చదువులు చదివించారు. సొంతంగా ప్రైవేటు సంస్థలను నెలకొల్పి, గిరిజన మహిళల అభ్యున్నఅభ్యున్నతి కోసం పని చేస్తున్నారు. వారికి ఆదర్శవంతంగా నిలిచారు. దేశానికే శ్రీకాకుళం కీర్తి ప్రతిష్టలు తెలిసేలా చేశారు.