నిరాడంబ‌రంగా శ్రీ‌ రామ‌ న‌వ‌మి సీతారాముల క‌ళ్యాణం

భ‌ద్రాచ‌లం శ్రీ‌ రాముల‌వారి పాదాల సాక్షిగా చ‌రిత్ర‌లో తొలిసారిగా భ‌క్తులు లేకుండా రాములోరి క‌ళ్యాణం స్వచ్చందంగా జ‌ర‌గ‌బోతోంది. సాధార‌ణ స‌మ‌యాల్లో రోజూ జ‌రిగే నిత్య‌క‌ళ్యాణంలోనే వంద‌లాది మందులు భ‌క్తులు పాల్గొంటుంటారు. కాని శ్రీ‌రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా ఏడాదికి ఓసారి జ‌రిగే సీతారాముల క‌ళ్యాణానికి ఈ సారి కేవ‌లం 40మందికి మాత్ర‌మే ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.

శ్రీ‌ రామ న‌వమి అంటే ప‌ల్లె నుంచి ప‌ట్నాలే కాదు మ‌హాన‌గ‌రాల్లో కూడా హ‌డావుడి అంతా ఇంతా కాదు. న‌వమి రోజున‌ రాముడు జ‌న్మించ‌డం, పెళ్లి రోజు కూడా కావ‌డంతో శ్రీ‌రామ‌న‌వమి రోజున దేవాల‌యాల్లోనే కాదు, వీధుల్లోనూ చ‌ల‌వ పందిళ్లు ఏర్పాటు చేసి సీతారాముల క‌ళ్యాణాన్ని ఘ‌నంగా నిర్వ‌హిస్తుండ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ విజృంభన కొన‌సాగిస్తున్న నేప‌థ్యంలో ఊరు వాడ‌ళ్లో సీతారాముల క‌ళ్యాణాల‌కు తెర‌ప‌డింది. ద‌క్షిణ అయోధ్య‌గా ప్రసిద్ధిగాంచిన భ‌ద్రాచ‌లంలోని శ్రీ‌ సీతారామ‌చంద్ర‌స్వామివారి దేవ‌స్థానంలో ఈ సాభ‌రి శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌లు నిరాడంబరంగా జ‌రుగుతున్నాయి. ఇక్క‌డ ప్ర‌తి ఏటా జ‌రిగే శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌కు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లతో పొరుగురాష్ట్రాల నుంచి భారీ సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చి క‌ళ్యాణాన్ని తిల‌కించేవారు. వేల‌సంఖ్య‌లో భ‌క్తుల క‌న్నుల పండువ‌గా సాగే శ్రీ‌రామ‌న‌వ‌మికి ఈ సారి కేవ‌లం 40 మందికి మాత్ర‌మే ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. మిథిలాస్టేడియంలో కాకుండా.. క‌రోనా ప్ర‌భావంతో దేవాల‌యం ప్రాంగ‌ణంలోనే పండితుల వేద‌మంత్రోచ్ఛ‌ర‌ణ‌ల మ‌ధ్య రేపు సీతారాముల క‌ళ్యాణం జ‌ర‌గ‌నుంది. క‌ళ్యాణ ప్ర‌క్రియ‌లో భాగంగా ఈ రోజు ఎదుర్కోలు కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

తెలంగాణ రాష్ట్ర దేవాదాయ‌శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి ఈ రోజు రాముల‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. కాగా, తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌ఫున రేపు ప‌ట్టువ‌స్త్రాల‌తో పాటు ముత్యాల త‌లంబ్రాల‌ను దేవస్థానానికి స‌మ‌ర్పించ‌నున్నారు. అనంత‌రం సంప్ర‌దాయం ప్ర‌కారం శ్రీ‌సీతారాముల క‌ళ్యాణాన్ని పండితులు జ‌రిపిస్తారు. అయితే క‌ళ్యాణ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుండ‌డంతో భ‌క్తులు ఇళ్ల‌లో ఉండి వీక్షించ‌డానికి వెలుసుబాటు క‌ల‌గ‌డం ఊర‌ట‌నివ్వ‌నుంది.