నాలుగు దేశాల దౌత్యవేత్తల నియామక పత్రాల సమర్పణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమోదించిన రాష్ట్రపతి

నాలుగు దేశాల దౌత్యవేత్తల నియామక పత్రాల సమర్పణ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమోదించిన రాష్ట్రపతి

నాలుగు దేశాల దౌత్యవేత్తల అధికార నియామక పత్రాలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు ఆమోదించారు. కొలంబియా రిపబ్లిక్, ఉరుగ్వే, జమైకా, ఆర్మీనియా రిపబ్లిక్ దేశాల రాయబారులు/హై కమిషనర్లు సమర్పించిన అధికార పత్రాలకు రాష్ట్రపతి వర్చువల్ పద్ధతిలో ఆన్ లైన్ ద్వారా ఆమోదం తెలిపారు. ఈ రోజు తమ అధికార నియామక పత్రాలను సమర్పించిన దౌత్యవేత్తలు:

మారియానా పచేకో మాంటెస్, కొలంబియా రిపబ్లిక్ రాయబారి

ఆల్బర్టో ఆంటోనియో గువానీ అమరిల్లా, ఉరుగ్వే రాయబారి

జేసన్ కీట్స్ మాథ్యూ హాల్, జమైకా హైకమిషనర్

యౌరీ బాబా ఖన్యాన్, ఆర్మీనియా రిపబ్లిక్ రాయబారి

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, నాలుగు దేశాల దౌత్యవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశానికి అన్ని దేశాలతో స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు. శాంతి, సౌభాగ్యం అనే ఉమ్మడి దార్శనికత ప్రాతిపదికగా వివిధ దేశాలతో భారతదేశ సంబంధాలు బలంగా వేళ్లూనుకున్నాయని ఆయన అన్నారు.

కోవిడ్-19 వైరస్ మహమ్మారిపై నిర్ణయాత్మకంగా ప్రతిస్పందన, ప్రపంచ స్థాయిలో జరిగిన కృషి, పోరాటంలో భారతదేశం ముందంజలో ఉంటూ వచ్చిందన్నారు. ఆరోగ్యం, ఆర్థిక బాగోగులు లక్ష్యంగా భారత్ ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. కోవిడ్ వైరస్ కట్టడికోసం జరిగిన ప్రపంచ స్థాయి పోరులో భాగంగా అత్యవసర మందులను సరఫరా చేయడంలో భారతదేశం క్రియాశీలంగా వ్యవహరించిందని, అనేక దేశాలకు తగిన సహాయ సహకారాలను అందించిందని, ‘ప్రపంచ ఔషధాగారం’గా తన పాత్రను నిర్వర్తించిందని రాష్ట్రపతి అన్నారు.

నియామక పత్రాలు సమర్పించిన నాలుగు దేశాల దౌత్యవేత్తలు తమ దేశ అధిపతుల తరఫున రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంతో తమతమ దేశాల సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి తాము కట్టబడి ఉన్నట్టు వారు పునరుద్ఘాటించారు.