రాజ‌కీయాల్లోకి రాన‌ని తేల్చి చెప్పిన‌ సూప‌ర్ స్టార్

రాజ‌కీయాల్లోకి రాన‌ని తేల్చి చెప్పిన‌ సూప‌ర్ స్టార్

సినీన‌టుడు ర‌జ‌నీకాంత్ నిన్న మ‌క్క‌ల్ మండ్రం నేత‌ల‌తో స‌మావేశం జ‌రిపి కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. దీంతో ఆయ‌న మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌న్న ఊహాగానాలు వ‌చ్చాయి. ఈ రోజు మ‌రోసారి వారితో చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో స‌మావేశం జ‌రిపిన అనంత‌రం ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.ర‌జ‌నీ మ‌క్క‌ల్ మండ్రాన్ని ర‌ద్దు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే, కొన్నేళ్ల క్రితం కొన‌సాగిన త‌న అభిమాన సంఘం మాదిరిగా ర‌జ‌నీ అభిమాన సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దాని ద్వారా త‌న సేవా కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తాన‌ని చెప్పారు. తాను రాజకీయాల్లోకి రాబోన‌ని తేల్చిచెప్పారు.ఇటీవ‌ల సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లి వ‌చ్చాన‌ని తెలిపారు. అలాగే, సినిమా షూటింగులు, క‌రోనా విజృంభ‌ణ కార‌ణంగా కొంతకాలం నుంచి మక్కల్ మండ్రం నిర్వాహకులతో స‌మావేశం నిర్వ‌హించ‌లేక‌పోయినట్లు తెలిపారు. వారందరికీ ఇప్ప‌టివ‌ర‌కు త‌న‌ రాజకీయ రంగ ప్ర‌వేశంపై ఎన్నో సందేహాలు ఉన్న నేప‌థ్యంలో దీనిపై మ‌రోసారి స్ప‌ష్టత ఇస్తున్న‌ట్లు తెలిపారు. కాగా, త‌మిళ‌నాడులో ఇటీవ‌ల‌ జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు రాజకీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించిన ర‌జనీ కాంత్ అనంత‌రం అనారోగ్యానికి గురవడంతో వెన‌క్కిత‌గ్గిన విష‌యం తెలిసిందే. రాజ‌కీయాల్లోకి రావ‌డానికి తాను ఏర్పాట్లు చేసుకుంటోన్న నేప‌థ్యంలో అనారోగ్యం ‌పాలు కావ‌డం దేవుడు చేసిన హెచ్చ‌రిక‌గా ఆయ‌న అభివ‌ర్ణిస్తూ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల త‌ర్వాత మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తారంటూ ప్ర‌చారం జ‌రిగింది. వాట‌న్నింటికీ ర‌జ‌నీ ఈ రోజు స‌మాధానం ఇచ్చారు.