పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక బ‌రిలో సుర‌భి వాణీదేవి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక బ‌రిలో సుర‌భి వాణీదేవి

హైదరాబాద్‌ -రంగారెడ్డి -మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవిని ఆ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సురభి వాణీదేవికి టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ రోజు బీ-ఫామ్ అందజేశారు.ఈ రోజు హైదరాబాద్-రంగారెడ్డి-మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌ నేతలతో కేసీఆర్ స‌మావేశం జ‌రిపిన అనంత‌రం ఆమెకు బీ-ఫామ్‌ను అంద‌జేశారు. ఈ స‌మావేశంలో ప‌లువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్‌ నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.సీఎంతో సమావేశం అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవితో పాటు ప‌లువురు నేతలు… అసెంబ్లీ వ‌ద్ద ఉండే గ‌న్‌పార్కుకు బయలుదేరారు. అమరవీరులకు వారు నివాళులు అర్పించిన తర్వాత సుర‌భి వాణీదేవి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మ‌రోవైపు, ఖమ్మం-వరంగల్‌-నల్గొండ స్థానానికి ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిని మ‌ళ్లీ బ‌రిలో దింపాల‌ని టీఆర్ఎస్ ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ విప‌రీతంగా ఉంది.