ఉచిత బియ్యం పంపిణీ:TS సర్కారు ఉత్తర్వులు

క‌రోనా వైర‌స్ విస్త‌ర‌ణ‌ను బ్రేక్ చేయ‌డానికి అమ‌లవుతున్న లాక్‌డౌన్ నేప‌థ్యంలో పేద కుటుంబాల‌ను ఆదుకోడానికి సంక‌ల్పించింది రాష్ట్ర ప్ర‌భుత్వం. పేద వ‌ర్గాలు ప‌స్తులు ఉండ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో పేద కుటుంబంలోని ప్ర‌తీ వ్య‌క్తికి 12 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వ‌డానికి సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించి ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రేప‌టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పేద‌ల‌కు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్ర‌మం ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు.. రాష్ట్రంలో 87.54 లక్షల ఆహార భద్రత కార్డులోని 2.81 కోట్ల మంది లబ్దిదారులకు ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యాన్ని ఉచితంగా అంద‌నుంది. రేషన్ షాపులు ఉదయం, సాయంత్రం అన్నీ వేళలు పనిచేసే విధంగా చర్యలు చేపట్టింది. ఇందుకు గాను ప్రభుత్వం రూ. 1,103 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. కాగా, రేపటి నుంచి ప్రారంభమయ్యే బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాల కలెక్టర్లు స్వయంగా ప‌ర్య‌వేక్షిస్తారు. సామాజిక దూరం పాటించాలనే నియమం ప్రకారం రేషన్ షాపుల వద్ద జనం ఒకేసారి గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి నెల రెగ్యులర్ గా రేషన్ తీసుకొనే కార్డు దారులకు బయోమెట్రిక్ పద్దతి అవ‌స‌రం ఉండ‌దు. గడిచిన 3 నెలలు రేష‌న్‌ తీసుకొని వారికి మాత్రమే బయోమెట్రిక్ పద్దతి పాటించవలసి ఉంటుంది.