బయటికి వస్తే జైలుకే: తెలంగాణ పోలీసులు

తెలంగాణలో పోలీసులు లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ఆకతాయులు అత్యవసరం లేకున్నా వాహనాలపై బయట తిరుగుతే జైలుకు పంపిస్తామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు.

లాక్ డౌన్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రజలు సహకరిస్తేనే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలుగుతామని అన్నారు. 99% మంది ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తున్నారని, 1% మాత్రమే ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. అలాంటి వాళ్ళవల్ల ఇన్ని రోజుల కష్టం వృధా అవుతుందని హెచ్చరించారు. పిల్లలు బయటికు రాకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసరమైతే తప్ప బయటికి పంపించవద్దని కోరారు.

ఎమర్జెన్సీ సర్వీసులు కొనసాగుతున్నాయని, ప్రజల సౌకర్యం కోసం ఆ ఏర్పాట్లు చేశామని అన్నారు. పోలీసులు 24 గం. లు కరోనా విధులు నిర్వర్తిస్తున్నారని వాళ్లకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 18 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు.

3500 పిటీ కేసులు, నిబంధనలు ఉల్లంఘించిన వివిధ సంస్థలపై 182 కేసులు నమోదు చేశామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన 17 వేల మందిపై ట్రాఫిక్ విభాగం కేసులు నమోదు చేసిందని తెలిపారు. ఇప్పటి వరకు 2724 వాహనాలను సీజ్ చేశామన్నారు. లాక్‌డౌన్ సమయంలో కూడా బైక్‌లపై ఇద్దరు, ముగ్గురు వెళ్తున్నారన్నారు. వాళ్ళను పట్టుకుని కేసులు నమోదు చేసి వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఐదుగురు మైనర్లు వాహనాలు నడుపతూ పట్టుబడ్డారని, వాళ్లపై కేసులు నమోదు చేశామన్నారు. లాక్‌డౌన్ సమయంలో తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వడం సరికాదని హెచ్చరించారు. అవసరమైతే తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.