క‌రోనా కట్టడికి టెలీ మెడిసిన్ టెక్నిక్!

క‌రోనా కట్టడికి టెలీ మెడిసిన్ టెక్నిక్!

భూమి త‌న చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టు తిరుగుతుంద‌న మ‌న ఖ‌గోళశాస్త్రం చెబుతున్న విష‌యం అందరికీ తెలిసిందే. కానీ, ప్ర‌స్తుతం యావ‌త్ ప్ర‌పంచ దేశాల‌న్నీ క‌రోనా చుట్టే తిరుగుతున్నాయంటే అతిశ‌యోక్తి కాదు. ఆ వ్యాధి వ్యాప్తి ఎలా ఆపాలి… మ‌రే విధంగా క‌ట్ట‌డి చేయాల‌ని మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నాయి. అయితే, ఇటువంటి త‌రుణంలో కొత్తగా ఒక టెక్నిక్ వైద్యవ‌ర్గాల‌ను అబ్బుర‌ప‌రుస్తుంది. అదే… టెలీమెడిసిన్ టెక్నిక్‌. అదేంటో చూద్దాం.

కరోనా వైరస్ దిన‌దినం తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశంలో ‘టెలీమెడిసిన్‌’ విధానంలో వైద్యసేవలు అందించటానికి ‘మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ మార్గదర్శకాలు జారీచేసింది. దీనివ‌ల్ల వైద్య సేవ‌లు మ‌రింత విస్తృతం కానున్నాయ‌ని ఎంసీఐ చెబుతోంది. టెలీమెడిసిన్ టెక్నిక్‌ విధానంలో వీడియో సమావేశం, ఫోన్‌ సంభాషణ లేదా మెసేజ్‌ల ద్వారా వైద్యులు రోగులకు వైద్య సలహాలను అందించే అవకాశం ఏర్ప‌డుతోంది. భారత్‌ వంటి భారీ జనాభా ఉన్న దేశాల్లో కరోనావైరస్‌పై పోరుకు టెలీమెడిసిన్‌ అద్భుతంగా సాయం చేయనుంది. చైనాలో కూడా ఆసుపత్రులు కిక్కిరిసన సమయంలో ఈ విధానంలో వైద్యం చేశారు. వైద్య వ్య‌వ‌స్థ పెద్ద‌గా విస్తృతం కాని భార‌త్‌కి ఈ విధానం బాగా ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం యోచ‌న చేస్తోంది.


టెలీమెడిసిన్‌ ఏంటో తెలుసుకుందామా?
ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల ద్వారా దూరంగా ఉన్న రోగులకు చికిత్సను అందించే వైద్యవిధానాన్ని టెలీమెడిసిన్‌ అంటారు. తద్వారా రోగుల వల్ల వైద్య సిబ్బందికి, ఇతరులకు కూడా అంటువ్యాధి సోకే ప్రమాదాన్ని నివారించవచ్చు. అంతే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన ఎక్కువ మందికి వైద్యం అందటానికి కూడా వీలవుతుంది. పరిమిత సంఖ్యలో వైద్యసిబ్బందితో ఎక్కవ మందిని కాపాడవచ్చు. భార‌త్ వంటి భారీ జ‌నాభా దేశానికి ఇదొక అద్భుత టెక్నిక్ అని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇప్పుడే ఎందుకు విడుద‌ల‌?
కోవిడ్ క‌ట్ట‌డిని నిలువ‌రించేందుకు కేంద్రం ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన టెలీమెడిస‌న్ ఏ విధంగా చూద్దాం. ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమలులో ఉంది. ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఆస్పత్రులకు వెళ్లటం కూడా కష్టసాధ్యంగా పరిణమించింది. ఇక మారుమూల ప్రాంతాలకు వైద్యసహాయాన్ని అందించటం మరింత సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ‘టెలీమెడిసిన్‌’ విధానంలో సేవలు అందించటానికి మెడికల్‌ కౌన్సిల్‌ ఆప్‌ ఇండియా (ఎంసీఐ), నీతి ఆయోగ్‌తో చర్చల అనంతరం మార్గదర్శకాలను రూపొందించింది. అందుబాటులో ఉన్న సాంకేతికతను ఏ విధంగా ఉపయోగించాలో వైద్యులు, వైద్యసిబ్బందికి స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది. అయితే దీని విన‌యోగానికి కేంద్ర ప్ర‌భుత్వం కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు సైతం విడుద‌ల చేసింది. టెలీమెడిసిన్‌ వైద్యసేవలు అందించేందుకు రిజిస్టర్ చేసుకున్న వైద్యులు మాత్రమే అర్హులని స్ప‌ష్టం చేసింది. దాంతోపాటు, రోగికి సాంకేతిక సేవలు సరిపోతాయా లేదా నేరుగా వైద్య సేవలు అందించాలా అనేది కూడా ఈ విధానంలో వైద్యులే నిర్ణయిస్తారని చెప్పింది. ఈ విధానంలో వైద్యుడు, రోగికి సంబంధించిన వివరాలు పరస్పరం తెలియజేయాల్సి ఉంటుంది. టెలీమెడిసిన్‌ విధానంలో వీడియో, ఆడియో, ఫోన్‌ మెసేజ్‌ల రూపంలో కూడా సేవలు అందించవచ్చని వెల్ల‌డిస్తుంది. ఔషధాలను సూచించేందుకు ప్రిస్క్రిప్షన్‌ ఇవ్వాలంటే రోగి తన వయస్సును కచ్చితంగా తెలియచేయాల‌ని వైద్య శాఖ వివ‌రిస్తుంది. అవపరమైతే వయస్సు నిర్ధారణకు ఆధారాన్ని కూడా చూపాల్సి ఉంటుందని వెల్ల‌డించింది. అంతేకాకుండా మొబైల్‌ యాప్‌లు, వెబ్‌సైట్లు వంటి టెక్నాలజీ ప్లాట్ ఫాంల ఏర్పాటుకు కూడా నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సూచనలు జారీచేసింది. వినియోగదారులకు తాము స్వయంగా వైద్య సలహాలు అందించరాదని.. ప్రభుత్వ అనుమతి పొందిన వైద్యులు ద్వారా మాత్రమే వైద్య సలహాలు అందించాలని అన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలకు నిర్దేశించింది.