ప్రస్తుతం కరోనా విజృంభిస్తుండటంతో యావత్ ప్రపంచం కకావికలమవుతోంది. అయితే, దాని ప్రభావం తెలుగు పత్రికలపై తీవ్రంగా పడనున్నట్టు కనిపిస్తోంది. పరిస్థితి చూస్తే అసలు పత్రికలు మూతపడుతాయన్నఆందోళన నెలకొంది. లేదా ఆర్థిక భారాన్ని మోయలేక సిబ్బందిని భారీగా తగ్గిస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. అమెరికాలో ఐదు దశాబ్దాల చరిత్ర ఉన్న భారతీయ పత్రిక ‘ఇండియా అబ్రోడ్’ తన ప్రింట్ ఎడిషన్‌ను ఈ రోజు (మార్చి) చివరి ఎడిషన్‌గా ప్రకటించడం ప్రపంచ వ్యాప్తంగా పత్రికల మనుగడపై భయాందోళనలు కలిగిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రింట్ ఎడిషన్‌ను మూసేయడానికి ప్రధానంగా కరోనా కల్లోలంతో పాటు యాడ్స్ లేకపోవడమే అని ‘ఇండియా అబ్రోడ్’ యాజమాన్యం ప్రకటించింది. పత్రికా ప్రపంచానికి ఇదో జీర్ణించుకోలేని చేదు వార్తని ఎక్స్ పర్స్ట్ అభిప్రాయపడుతున్నారు. 1970లో ప్రవాస భారతీయుడు గోపాల్రాజు ఈ పత్రికను స్థాపించాడు. ఆ తర్వాత కాలంలో పలువురి చేతులు మారింది. 2011లో రిడిఫ్ డాట్కాం కొనుగోలు చేసింది. 2016లో 8కే మైల్స్ మీడియా ఇంక్ అనే సంస్థ యాజమాన్య హక్కులు పొందింది. తాజాగా ప్రింట్‌ను నిలిపేసి కేవలం వెబ్ ఎడిషన్ మాత్రమే కొనసాగుతుందని యాజమాన్యం ప్రకటించింది. కరోనా సృష్టిస్తున్న కల్లోలం నేపథ్యంలో ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ ఆర్కే ఆదివారం తన ‘కొత్త పలుకు’లో ప్రింట్ మీడియా మనుగడపై ఆందోళన వ్యక్తం చేసిన మరుసటి రోజే అమెరికాలో భారతీయ మూలాలున్న పత్రిక మూతపడడం గమనార్హం. ఆర్కే తన ఆర్టికల్‌లో మీడియాకు కలిగే నష్టం గురించి ఏమన్నారో తెలుసుకుందాం. ‘కరోనా ప్రభావం పడని రంగం అంటూ ఏదీ మిగలలేదంటే అతిశయోక్తి కాదు. మొదటగా కుదేలైనవి విమానయాన, పర్యాటక రంగాలు కాగా, రెండవ స్థానంలో మీడియా ఉంది. లాక్డౌన్ కారణంగా వ్యాపార ప్రకటనలు నిలిచిపోయి మీడియా.. ముఖ్యంగా పత్రికల మనుగడే ప్రశ్నార్థకం అవుతోంది. ఖర్చులు తగ్గించుకునే క్రమంలో పేజీల సంఖ్యను కుదించుకోవడం మినహా పత్రికలకు మరో ప్రత్యామ్నాయం లేదు. మరో రెండు మూడు నెలలు ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో పలు పత్రికలు మూతపడినా ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. అదే జరిగితే లక్షల మంది ఉపాధి కోల్పోతారు’ అని ఆర్కే రాసిన మరుసటి రోజే ఇలా జరగడం సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలుగులో ప్రధానంగా ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ లాంటి పెద్ద పత్రికలు, వార్త, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి, తదితర చిన్న పత్రికలున్నాయి. ఈ పత్రికా యజమానుల రాజకీయ పాలసీలతో ఎవరికైనా విభేదాలు ఉండొచ్చు. మరో రెండు మూడు నెలలు ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతితో పాటు ఇతర పత్రికల్లోని సిబ్బందిని భారీగా తగ్గించే ప్రమాదం లేకపోలేదు. ఎవరైతే మాత్రం ఆర్థిక భారాన్ని మోస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
అయితే, ఇప్పటికే పత్రికల్లో పనిచేస్తున్న అన్ని విభాగాల్లోని సిబ్బందిలో ఉద్యోగాలు ఎక్కడ పోతాయోననే ఆందోళన నెలకొంది. అంతేకాదు జీతాలు కూడా భారీగా తగ్గిస్తారేమోనని ఉద్యోగులు భయపడుతున్నారు. ఒకవేళ ఉద్యోగమే కావాలనుకుంటే జీతాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుందనే షరతు విధిస్తూ ఇప్పటి నుంచే మానసికంగా ఉద్యోగులను సిద్ధం చేస్తున్నట్టు కొన్ని పత్రికల సిబ్బంది తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్రికల్లో నీతులు రాస్తున్నంత మాత్రాన ఆచరిస్తాయనుకుంటే అంతకంటే అజ్ఞానం, అమాయకత్వం మరొకటి లేదు. అన్నీ బాగున్నప్పుడే ఉద్యోగులకు రూ.500 ఇంక్రిమెంట్ వేసేందుకు మనసు రాని పెద్ద పత్రికలు మనవి. అలాంటిది కరోనా విపత్తు సమయంలో మానవీయ కోణంలో పత్రికా యజమానులు ఆలోచిస్తారని అనుకోలేం. ఈ విపత్తును తమకు అనుకూలంగా మలుచుకుని సిబ్బందిని తొలగించేందుకే ప్రాధాన్యం ఇస్తాయని జర్నలిస్టు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పత్రికల్లో పనిచేసే సిబ్బందికి మున్ముందు గడ్డుకాలం ఎదుర్కొక తప్పదన్న విషయం అర్థం అవుతోంది.