“కోట”లోన్నాము కరుణించండి మహాప్రభు

NEET కోచింగ్‌ కోసం రాజస్థాన్‌ రాష్ట్రంలోని కోటకు వెళ్లిన తెలంగాణ, ఏపీకి చెందిన 200 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తొలి 21రోజుల లాక్‌డౌన్‌ అనంతరం ఇళ్లకు వెళ్లిపోవచ్చని అనుకుని, 15న రైళ్లకు టికెట్లు బుక్‌ చేసుకున్నారు. కానీ కుదరలేదు. ఉత్తర్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు తమ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను ప్రత్యేక బస్సులలో తీసుకెళ్లిపోయాయి. దీంతో చాలా ప్రైవేటు వసతిగృహాలు ఖాళీ అయిపోయాయి. కొన్ని వసతిగృహాల్లో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులే మిగిలారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు వీరికి వంటచేసి పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు.

వసతి గృహాల్లో సరిగా భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో అలాగే కోట పట్టణంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళనగా ఉందని విద్యార్థులు వాపోతున్నారు. ఈ విషయంపై ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రక్షించాలని విజ్ఞప్తి చేసారు. విద్యార్థుల ఇబ్బందులపై స్పందించిన ఉపరాష్ట్రపతి కోట పార్లమెంట్ సభ్యుడు అలాగే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో ఫోన్ లో మాట్లాడి తెలుగు విద్యార్థులకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని కోరారు.

అయితే విద్యార్థులకు అవసరమైన నిత్యావసరాలు అందించడంతో పాటు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక MP ఓం బిర్లా తెలిపారు. ఈ విద్యార్థులకు అవసరమైన వైద్య సదుపాయాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, స్వరాష్ట్రానికి వెళ్లేందుకు తగిన రవాణా సదుపాయాలను ఏర్పాటు చేయాలన్న ఉప రాష్ట్రపతి సూచనను సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.