వైద్యుల స‌ల‌హా మేర‌కు ఆసుప‌త్రిలో చేరిన సచిన్

వైద్యుల స‌ల‌హా మేర‌కు ఆసుప‌త్రిలో చేరిన సచిన్

కొన్ని రోజుల క్రితం రోడ్‌ సేప్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌లో పాల్గొన్న టీమిండియా మాజీ క్రికెట‌ర్ సచిన్‌ టెండూల్కర్‌కు కరోనా సోకిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని తెలుపుతూ ఇటీవ‌లే ఆయ‌న‌ ట్వీట్ చేశారు. త‌న‌కు స్వల్ప లక్షణాలతో పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆయ‌న పేర్కొన్నారు. అయితే, వారం రోజులుగా హోం క్వారంటైన్‌లో ఉన్న స‌చిన్ ఇప్పుడు ఆసుప‌త్రిలో చేరారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ ఆయ‌న ట్వీట్ చేశారు.మీరు చూపుతోన్న ప్రేమ‌కు, చేస్తోన్న ప్రార్థ‌న‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను. పూర్తిస్థాయిలో జాగ్ర‌త్తలు తీసుకోవాల్సి ఉండ‌డంతో వైద్యుల స‌ల‌హా మేర‌కు ఆసుప‌త్రిలో చేరాను. కొన్ని రోజుల్లో మ‌ళ్లీ ఇంటికి చేరుకుంటాన‌ని భావిస్తున్నాను. ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ సుర‌క్షితంగా ఉండాలి’ అని స‌చిన్ ట్వీట్ చేశారు.కాగా, టీమిండియా వ‌న్డే ప్రపంచకప్ ను కైవ‌సం చేసుకుని నేటికి 10 సంవత్సరాలు గ‌డుస్తున్న నేప‌థ్యంలో ఈ విష‌యంపై కూడా స‌చిన్ స్పందించారు. భార‌తీయులు, టీమిండియాకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. కాగా, టీమిండియా 2011లో ప్ర‌పంచ క‌ప్ గెలుచుకుంది. అంత‌కు ముందు 1983లో టీమిండియా ప్ర‌పంచ క‌ప్ సాధించింది.