‘యాపిల్​’ను కోర్టుకీడ్చిన ఫ్రాన్స్​ ప్రభుత్వం

‘యాపిల్​’ను కోర్టుకీడ్చిన ఫ్రాన్స్​ ప్రభుత్వం

టెక్ దిగ్గజం ‘యాపిల్’ను ఫ్రాన్స్ ప్రభుత్వం కోర్టుకీడ్చింది. వ్యాపారంలో స్టార్టప్ లను సంస్థ మోసం చేస్తోందని, తాను చెప్పిందే వేదంగా వాటిపై పెత్తనం చెలాయిస్తోందని మండిపడుతూ వేసిన వ్యాజ్యాన్ని కోర్టు విచారణకు స్వీకరించింది. సెప్టెంబర్ 17న ఆ కేసును విచారించనుంది. 2018లోనే ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి బ్రూనో లీ మైర్ పిటిషన్ ను వేసినా.. మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఆ కేసును ప్యారిస్ బిజినెస్ కోర్టు విచారించనుంది.దేశ డిజిటల్ మార్కెట్స్ చట్టం నిబంధనలను యాపిల్ సంస్థ అస్సలు అమలు చేయకుండా స్టార్టప్ లను మోసం చేస్తోందని మంత్రి తరఫున పిటిషన్ వేసిన కాంపిటీషన్ అండ్ యాంటీ ఫ్రాడ్ ఏజెన్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక స్టార్టప్ లు తయారు చేసిన యాప్ లకు యాపిల్, గూగుల్ వంటి సంస్థలే ధరలను నిర్ణయిస్తున్నాయని, ఏకపక్షంగా కాంట్రాక్టులను మార్చేస్తున్నాయని ఆరోపించింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు యాపిల్ కు 20 లక్షల యూరోల (సుమారు రూ.17.72 కోట్లు) జరిమానా విధించాల్సిందిగా పిటిషన్ లో పేర్కొంది. దీనికి తోడు ఇటీవలే ఫ్రెంచ్ టెక్ స్టార్టప్స్ సంఘం ‘ఫ్రాన్స్ డిజిటల్’ కూడా సంస్థపై ఫిర్యాదు చేసింది.కోర్టు విచారణపై స్పందించేందుకు ప్రభుత్వ అధికారులు నిరాకరించారు. ప్రస్తుతం కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని అన్నారు. మరో మూడు నెలల్లో ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పిటిషన్ విచారణ కీలకంగా మారనుందని యూరోపియన్ స్టార్టప్ నెట్ వర్క్ అధ్యక్షుడు నికోలస్ బ్రయన్ అన్నారు.