
సీఎం హోదాలో వెళ్లిన వ్యక్తి తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్న హైకోర్టు
తిరుమల శ్రీవారిని దర్శించుకునే అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన ఉన్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లిన నేపథ్యంలో డిక్లరేషన్ ఇవ్వకపోవడంతో ఈ అంశంపై రగడ కొనసాగింది. తిరుమల వెళ్లిన జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోవడం చట్ట విరుద్ధమని గుంటూరు జిల్లా వైకుంఠపురానికి చెందిన రైతు ఆలోకం సుధాకర్‌బాబు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్‌కు విచారించబోమని చెప్పింది. ఈ మేరకు 27 పేజీల తీర్పును వెలువరించింది.సీఎం హోదాలో ఉన్న వ్యక్తి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తీర్పు వెల్లడించారు. హిందూయేతరుడిగా వ్యక్తిగత హోదాలో వెళితేనే డిక్లరేషన్ అవసరమని చెప్పారు.వైఎస్ జగన్ సీఎం హోదాలో బోర్డు ఆహ్వానం మేరకు తిరుమల వెళ్లారని గుర్తు చేశారు. జగన్‌పై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలను చూపడంలో పిటిషనర్ విఫలమయ్యారని కోర్టు తెలిపింది. జగన్ క్రైస్తవుడు అని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలను కోర్టు ముందుంచలేదని చెప్పింది. చర్చికి వెళ్లి ప్రార్థనలు చేయడం, క్రైస్తవ సభలకు హాజరు కావడం వంటి వాటితో ఓ వ్యక్తిని ఆ మతానికి చెందిన వాడిగా పరిగణించలేమని తెలిపింది.