న్యూజిలాండ్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయం

న్యూజిలాండ్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయం

న్యూజిలాండ్ ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ ఘనవిజయం అందుకోగా, ప్రస్తుత ప్రధాని జసిండా ఆర్డెన్ రెండో పర్యాయం ఆ పదవిని అధిష్ఠించనున్నారు. నిన్న జరిగిన న్యూజిలాండ్ ఎన్నికలలో మొత్తం 83.7 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇందులో లేబర్ పార్టీకి అత్యధికంగా 49 శాతం ఓట్లు లభించగా, విపక్ష నేషనల్ పార్టీకి 27 శాతం ఓట్లు వచ్చాయి.వాస్తవానికి సెప్టెంబరు 19న న్యూజిలాండ్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా షెడ్యూల్ లో మార్పులు చేశారు. నిన్న దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించారు. జసిండా ఆర్డెన్ పరిపాలనపై న్యూజిలాండ్ ప్రజలు నమ్మకం ఉంచారన్న విషయం తాజా ఫలితాలతో వెల్లడైంది.దీనిపై జసిండా ఆర్డెన్ మాట్లాడుతూ, తదుపరి పదవీకాలంలో చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. మరోసారి ప్రజలు తనపై విశ్వాసం వ్యక్తం చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపారు. కరోనా ప్రభావంతో దెబ్బతిన్న న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థను కుదుటపడేట్టు చేయడమే తన ప్రథమ కర్తవ్యం అని ఆర్డెన్ ఉద్ఘాటించారు.