భూమిని దాటుకుంటూ వెళ్లిన అతిపెద్ద గ్రహశకలం

భూమిని దాటుకుంటూ వెళ్లిన అతిపెద్ద గ్రహశకలం

అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న ఒక పెద్ద గ్రహశకలం ఆదివారం భూమికి సమీపం నుంచి అత్యంత వేగంతో దూసుకెళ్లింది. జీఎంటీ కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ఇది భూమిని దాటినట్లు ఫ్రాన్స్‌లోని అతిపెద్ద ఖగోళ పరిశోధన కేంద్రం తెలిపింది. 2001 ఎఫ్‌ఓ32 పేరుతో పిలిచే ఈ గ్రహశకలం ఈ ఏడాది భూమికి చేరువగా వచ్చే వాటిలో అతి పెద్దదని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వెల్లడించింది.భూమికి 20 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ఈ గ్రహశకలం దూసుకెళ్లిందని ఫ్రాన్స్‌ ఖగోళ కేంద్రం పేర్కొంది. భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరానికి ఇది 5.25 రెట్లని తెలిపింది. 900 మీటర్లు పొడవైన ఈ గ్రహశకలాన్ని 20 ఏళ్ల కిందట గుర్తించినట్లు నాసా తెలిపింది. గంటకు 1,24,000 కిలోమీటర్ల వేగంతో భూమిని దాటుకుంటూ పోయిన‌ 2001 ఎఫ్‌ఓ32 వల్ల ప్రస్తుతం లేదా మరో వంద ఏళ్లలో ఎలాంటి ముప్పు లేదని తెలిపింది. అయితే, భవిష్యత్తులో ప్రమాదకరంగా మారవచ్చని అంచనా వేసింది.మన సౌరవ్యవస్థ ఆవిర్భావం నుంచే ఈ గ్రహశకలం ఉద్భవించినట్లుగా భావిస్తున్నారు. దాని ఉపరితలం నుండి ప్రతిబింబించే కాంతిని అధ్యయనం చేయడం ద్వారా అందులోని మూలకాల గురించి తెలుసుకోవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. దాని ఉపరితలం నుంచి ప్రతిబింబించే కాంతి వర్ణపటాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఈ గ్రహశకలం ఉపరితలంపై ఉన్న ఖనిజాల రసాయనాలను అంచనా వేయవచ్చని పేర్కొంది. 2001 ఎఫ్‌ఓ32 గ్రహశకలం‌ తిరిగి 2052లో భూమికి సమీపంగా రానుందని నాసా వెల్లడించింది.