బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి

బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

వారి సందేశంలోని పూర్తి అంశాలు.

బుద్ధ భగవానుని జయంతికి గుర్తుగా జరుపుకునే బుద్ధపూర్ణిమ శుభ సందర్భంలో దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు.

సత్యం, ధర్మం, నిజాయితీ అనే మార్గాన్ని అనుసరించే దిశగా బుద్ధ భగవానుడు ప్రపంచ మానవాళిని ప్రేరేపించారు. ఆయన బోధనలు ఆధ్యాత్మిక మేలు కొలుపు ద్వారా ప్రజలకు దిశను, దశను చూపించాయి. శాంతి, సత్యం, కరుణ అనే బుద్ధ భగవానుని సందేశాలు ప్రపంచాన్ని జ్ఞాన మార్గంలో నడిపించాయి. వారి బోధనలు అన్ని కాలాలకు ఆచరణీయాలే.

కోవిడ్ -19 మహమ్మారి విసురుతున్న సవాళ్ళను అధిగమిస్తున్న ఈ పరీక్షా సమయంలో, మనమంతా సార్వత్రిక ప్రేమ, సహనం, కరుణ అనే మార్గాలను అవలంబించారు. పేదలు మరియు సహాయం అవసరమైన వారికి ఆపన్న హస్తాన్ని అందించాలి. కరోనా వైరస్ కు వ్యతిరేకంగా జరిగే ఈ యుద్ధంలో ఇతరులను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెడుతున్న ముందు వరుస యోధులకు సైతం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయాలి.