మండుటెండలో కాలువల్లో ఈ తరం యువత ఈతలు

చందలాపూర్ ప్రధాన ఎడమ కాలువ నుంచి పిల్ల కాలువ తీయడం ద్వారా చిన్నకోడూర్, బెల్లంకుంట, పెద్ద చెరువు నిండనున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్ధిపేట జిల్లా చందలాపూర్ ప్రధాన ఎడమ కాలువ కింద సోమవారం ఉదయం పిల్ల కాల్వ తీసేందుకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. అనంతరం ప్రధాన కాలువ వెంట మంత్రి కలియ తిరిగారు. మంత్రి వెంట చిన్నకోడూర్ మండల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సిద్ధిపేట రంగనాయక సాగర్, ప్రధాన కాలువలకు గోదావరి జలాలు రావడంతో.. స్థానిక యువత ఆనందంతో కేరింతలు కొడుతూ.. కాలువల్లో ఈతలు కొట్టడం ప్రారంభించారు. ఏం సంగతి బిడ్డ కాల్వల్లో ఈత కొడుతున్నారా అంటూ ఆప్యాయంగా యువతను మంత్రి పలకరించారు. మా ఊర్లకు నీళ్లు వచ్చినయ్ సార్. ఇక మాకు సంబరమైతుందని అందుకే కాలువల్లో ఈత కొడుతున్నట్లు యువకులు చెప్పుకొచ్చారు. పొద్దున్న, సాయంత్రం ఈత కొట్టాలని అసలే ఎండాకాలం ఈ సమయంలో ఈతలు కొట్టాలని యువకులకు మంత్రి హితవు పలికారు. కాళేశ్వరం నీళ్లు కాల్వల ద్వారా గ్రామాల్లోకి చేరడంతో.. ఈతరం మారుతున్నదని స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రి ముచ్చటించారు.