కరోనా కట్టడికి తిరుమల TTD మరో ముందడుగు

కరోనా కట్టడికి తిరుమల TTD మరో ముందడుగు

పరిపాలనా భవనంలో థర్మల్ స్కానింగ్ పరీక్షలు
అందుబాటులో శానిటైజింగ్ ప‌రిక‌రాలు
సందర్శకుల నిలిపివేత

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడానికి ఇప్పటికే అనేక జాగ్రత్తలు తీసుకున్న టిటిడి యాజమాన్యం సోమవారం మరో ముందడుగు వేసింది. తిరుపతిలోని పరిపాలనా భవనంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు థర్మల్ స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరిపాలనా భవనం ప్రధాన ద్వారం వద్ద చేతులు శుభ్రం చేసుకున్నాకే లోనికి అనుమతిస్తున్నారు. పరిపాలనా భవనం లోపల కూడా చేతులు శుభ్రం చేసుకునేందుకు వీలుగా ప‌లు చోట్ల శానిటైజర్ ప‌రిక‌రాల‌ను అందుబాటులో ఉంచారు. పరిపాలనా భవనంలో ఉద్యోగులు ఎక్కువ మంది ఒకే చోట చేరకూడదని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేలకు ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉద్యోగులకు షిఫ్టుల వారీగా విధులు నిర్వహించేందుకు అనుమతించారు. 50 శాతం మంది వారం రోజుల పాటు కార్యాలయానికి హాజరైతే, మిగిలిన 50 శాతం మంది ఇంటి నుంచి ఈ ఆఫీస్ ద్వారా విధులు నిర్వహించుకునేలా వెసులుబాటు కల్పించారు. ఇంటినుంచి పనిచేసే సిబ్బంది త‌మ విభాగాధిపతుల‌కు ఫోన్లో అందుబాటులో ఉండాలని టిటిడి యాజమాన్యం ఆదేశించింది. అత్యవసర విధులు నిర్వహించే విభాగాల సిబ్బంది మాత్రం ఎళ్లవేళలా అందుబాటులో ఉంటారు.