తిరుపతి ఫ్లయ్ ఓవర్ స్తంభాలపై నామాల వివాదం

తిరుపతి ఫ్లయ్ ఓవర్ స్తంభాలపై నామాల వివాదం

తిరుపతిలో అంతా వెంకన్నే. అన్ని చోట్లా నామాలే. ఈ నామాలకు జామెట్రీ లెక్కలేవో ఉన్నాయని వైష్ణవ సంప్రదాయంలో పెద్దలు చెబుతుంటారు. ముక్కు మీది వరకు నామం, నుదుటి మీద మాత్రమే నామం, గోపీ చందన నామం, లలాట ఫలకే కస్తూరీ తిలకం, భుజాల మీద నామాలు, భుజాల మీద శాశ్వత శంఖు చక్రాలు . . . తిలకాధారణలో మధ్వ సంప్రదాయం , ఇస్కాన్ సంప్రదాయం. . . ఇలా ఇదంతా పెద్ద తిలక ధారణ శాస్త్రం. వైష్ణవుల్లోనే ఈ నిలువునామం విషయంలో తెంగలై , వడగలై అని ఏవో కొన్ని అభిప్రాయభేదాలున్నాయి. అయినా తిరుమల తిరుపతి దేవస్థానాలకు తమిళ వైష్ణవమే నచ్చుతుంది కాబట్టి- ఈ విషయంలో ఇంతకంటే లోతుగా వెళ్లి ప్రయోజనం లేదు. దీనికితోడు నిలువునామం- అడ్డనామం గొడవలు శతాబ్దాలుగా ఉన్నవే.

అసలు దైవనామం వదిలి నిలువునామం దగ్గరే ఆగిపోవడమేమిటి? అని ఆధునికులు విసుక్కుంటారు. కానీ నామమహిమ ఎంత గొప్పదో, నామం పెట్టుకోవడం అంతే గొప్పది. నిలువు నామం పెట్టుకునే పద్దతినిబట్టి వారు ఏ సంప్రదాయం ఫాలో అవుతున్నారో తెలిసిపోతుంది. నామాలు రకరకాలుగా ఉన్నప్పుడు సహజంగా అందులో ఏది గొప్ప? ఏది కాదు ? అనే చర్చ ఉండితీరుతుంది. ఆ విషయం ఇక్కడ అప్రస్తుతం.

పుణ్యక్షేత్రం తిరుపతిలో ఫ్లయ్ ఓవర్ శంఖుస్థాపన జరిగింది. పిల్లర్లు మొలిచాయి. ఎవరికి ఐడియా వచ్చిందోగానీ, ప్రతి పిల్లర్ పైన నామాలను చెక్కారు. కొన్నిటికి రంగులు కూడా వేశారు. మంచిదే. రేప్పొద్దున నామాలమీద ప్రయాణం చేస్తారు. అంటే భక్తుల కాళ్ల కింద నామాలు ఉంటాయి. అది మహాపచారం. వెంటనే నామాలను తొలగించి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి- అని ఒక వివాదాన్ని సృష్టించారు. అంతకు ముందు నామాలు మంచి ఆలోచన అన్నవారు కూడా ఇప్పుడు అనుమానంలో పడ్డారు. చివరికి నామాలు ఉంటాయో? ఉండవో తెలియని సందిగ్ధావస్థ.

కర్ణాటక శివమొగ్గ, తుముకూరు ప్రాంతంలో ఒక కథ బహుళ ప్రచారంలో ఉంది. రవాణా సౌకర్యాలు లేనిరోజుల్లో శ్రీ శైలానికి భక్తులు గుంపులు గుంపులుగా కాలినడకన వెళ్లేవారు. ఒక గుంపులోనుండి ఒక భక్తుడు దారితప్పి చీకటివేళ ఒక గ్రామం చేరాడు. ఒక గుడిసె ముందు కాళ్లు బారజాపుకుని ఒక ముసలామె వక్కాకు దంచుకుంటూ ఉంది. ఈ భక్తుడు ఆయాసంగా ఆ ముసలామెను అడిగాడు. శ్రీశైలం వెళ్లాలి. దారి తప్పాను. రాత్రికి ఇక్కడే ఎక్కడయినా పడుకుని తెల్లవారుతుండగా వెళతాను. ఎలా వెళ్లాలి? ఎటు వెళ్లాలి? అని. ముసలామె ఆప్యాయంగా ఇదిగో అటు వైపు శివుడి గుడి మంటపం ఉంది. అక్కడికెళ్లి పడుకుని పొద్దున్నే అక్కడినుండి తూర్పు దారిలో వెళ్ళు అంది. భక్తుడు మంటపానికి వెళుతూ- అవ్వా నువ్వేమీ అనుకోనంటే ఒక విషయం చెబుతా. గుడి వైపు నువ్వు కాళ్ళుజాపి ఉన్నావు. కాళ్ళు ఇంకో వైపుకు తిప్పు అన్నాడు. అవ్వ నవ్వుతూ- శివుడు లేనివైపు చెప్పు అటే కాళ్ళు పెట్టుకుంటా అంది. ఏదో జ్ఞానోదయమయినవాడిలా భక్తుడు వెళ్ళిపోయాడు. పది రోజుల తరువాత శ్రీశైలంలో గుడి గోపురం ముందు భక్తుడికి అదే అవ్వ కనిపించి మాయమయ్యింది. శివుడు లేనిదెక్కడ? అన్న అవ్వ మాట భక్తుడిలో ప్రతిధ్వనిస్తూనే ఉంది.

కథను కొద్దిగా తిరుపతికి మార్చుకుంటే వెంకన్న లేనిదెక్కడ? అని ప్రతిధ్వనించాలి. అప్పుడు నామాలు లేనిదెక్కడ? అని కూడా ప్రతిధ్వనించాలి. భక్తి పైపైన కాకుండా అంతరాంతరాల్లో ప్రతిఫలించాలి.
అందుకే- అంతయు నీవే హరి పుండరీకాక్షా! అని అన్నమయ్య అనగలిగాడు. మనం నామం దగ్గరే ఆగి ఉన్నాం.

-పమిడికాల్వ మధుసూదన్