తూచ్… బతికే ఉన్నాను, ప్రజలకు దర్శనమిచ్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్

ఉత్తర కొరియా దేశానికి చెందిన అధికారిక “న్యూస్ ఏజెన్సీ KCNA” శనివారం ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో ఎరువుల కర్మాగార వేడుకల్లో పాల్గొన్నారని తెలిపింది. దీంతో కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యమనే ప్రచారమంతా “తూచ్” అనేసింది.

ప్రపంచానికి ఏప్రిల్ 11 తర్వాత కిమ్ జోంగ్ కనిపించకపోవడం, వంశపారంపర్యంగా వస్తోన్న దేశ అత్యున్నత వేడుకల్లో పాల్గొనకపోవడం, ఆయన సోదరే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని పాలన సాగిస్తుండటంతో ప్రపంచంలోని మీడియా కిమ్ జోంగ్ బతికిలేరని కొందరు, తీవ్ర అనారోగ్యమని మరికొందరు ప్రచారం చేసారు. కానీ దక్షిణ కొరియా దేశం మాత్రం గతంలో ఇలాగే ప్రచారం జరిగిందని అధికారిక ప్రకటన వస్తే తప్ప కిమ్ జోంగ్ వ్యవహారాలపై స్పందించమని తేల్చింది.

కొద్ది రోజుల కిందట కిమ్ జోంగ్ ఉన్‌ గుండె శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అలాగే గత వారం ఆప్తమిత్రుడు డ్రాగన్ దేశం చైనా నుంచి ఉన్నతస్థాయి డాక్టర్ల బృందం ఉత్తర కొరియా వెళ్లి రావడంతో కిమ్ జోంగ్ ఇకలేరనే అనుమానాలు మరింత బలపడ్డాయి. కానీ నార్త్ కొరియా అధికారిక మీడియా ఈ వార్తలను ఖండించింది. దాదాపుగా 20 రోజులు ఈ ప్రచారం సాగింది.