మహామ్మారిపై మన్యం ప్రజల జాగ్రత్తలు

మన దేశంలో ఏమి జరిగిన ప్రభుత్వాన్నే నిలదీస్తాం. మన వంతు పాత్ర ఏంటని మాత్రం అస్సలు మనకు బాధ్యత ఉండదు. కానీ మన్యంలో జనం కరోనా కారణంగా మాస్కుల కోసం ప్ర‌భుత్వం, స్వ‌చ్ఛంద సంస్థ‌ల సాయం కోసం ఎదురు చూడ‌లేదు? గ్రామాల‌వైపు బ‌య‌టి వ్య‌క్తుల‌ను రానీయ‌కుండా ఎక్క‌డిక్క‌డ ద‌డులు క‌ట్టుకున్నారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ అంద‌రికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు విశాఖ ఏజెన్సీ మ‌న్యం ప్ర‌జ‌లు.

క‌రోనా వైర‌స్‌ను కట్టడి చేసే విష‌యంలో మ‌న్యం ప్ర‌జ‌లు పట్టణంలోని నాగరీకులకంటే ఓ అడుగు ముందే ఉన్నారు. క‌రోనా వైర‌స్ విష‌యంలో ప్ర‌భుత్వాలు, ప్ర‌సార సాధ‌నాల క‌న్నా ముందే గిరిపుత్రులు మేల్కొని అవ‌గాహ‌న పెంచుకుని త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల జ‌నం … బ‌య‌టి వారిని త‌మ నివాస ప్రాంతాల‌వైపు రానీయ‌కుండా ద‌డులు క‌ట్టుకున్నారు. అంతేకాదు, స్వీయ నియంత్ర‌ణ‌లో ఉంటూ సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. వైద్య సదుపాయాలు, చేతికి తొడుగులు, మాస్కుల కోసం ఎదురుచూడ‌కుండా ప‌చ్చ‌ని చెట్ల ఆకుల‌తో మాస్కులు త‌యారు చేసి ధ‌రిస్తున్నారు. ఇక్క‌డ ఇంకో విష‌యం చెప్పాలి. వాడిన మాస్కుల‌ను వాడ‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌గా ఆకుల‌తో మాస్కులు త‌యారు చేసుకుంటున్నారు. వైద్య స‌దుపాయాల్లేని మ‌న్యంలో క‌రోనా వైర‌స్‌ కట్టడికి సొంతంగా ఔష‌ద గుణాలున్న ఆకుల‌తో మాస్కులు త‌యారు చేసి కాపాడుకుంటున్నారు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా మన్యంలో వైరస్ సోకకుండా చేప‌ట్టిన చ‌ర్య‌ల్లో భాగంగా
10 వ‌ర‌కు క్వారంటైన్ వార్డుల‌ను ఏర్పాటు చేసింది.