కరోనాపై తిరుమల TTD అప్రమత్తం

కరోనాపై టీటీడీ అప్రమత్తం

భారత్‌లో కరోనా వైరస్‌ సోకుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతన్న నేపథ్యంలో టీటీడీ ముందుస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. తిరుమల, అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో అనుమానితుల గుర్తింపునకు పరికరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఈ క్రమంలోనే శుక్రవారం అలిపిరి టోల్‌ గేట్‌ వద్ద టీడీపీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ధర్మారెడ్డిలు కరోనా నివారణ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అలాగే ప్రతి 2 గంటలకోసారి తిరుమలలో పరిశుభ్రత చర్యలు చేపట్టనున్నట్టు టీటీడీ పేర్కొంది. తిరుమల, తిరుపతిలో కరోనా వైరస్‌ అవగాహన కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. మరోవైపు కరోనా ఆందోళనల నేపథ్యంలో వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్టలో ఏప్రిల్‌ 7న నిర్వహించే కోదండరామస్వామి కళ్యాణన్ని రద్దు చేసే యోచనలో టీటీడీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వేడుకకు లక్ష మందికి పైగా భక్తులు హాజరుకానున్నడంతో కళ్యాణం నిర్వాహణకు సంబంధించి ప్రభుత్వానికి లేఖ రాసినట్టు సింఘాల్‌ తెలిపారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అనుమతించకపోతే ఆలయంలోనే సింపుల్‌గా స్వామివారి కళ్యాణం నిర్వహిస్తామని చెప్పారు.

కరోనాపై మరింత అప్రమత్తం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆందోళన వద్దు
సిమ్స్‌లో కరోనా పరీక్ష కేంద్రం ఏర్పాటు
వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి
అమరావతి : రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా మరింత అప్రమత్తత చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నెల్లూరులో ఇటలీ నుంచి వ్యక్తికి కరోనా పాజిటివ్‌ కేసు నమోదయిందని వెల్లడించారు. బాధితుడు ఉన్న ప్రాంతం చుట్టుపక్కల కిలోమీటరు వరకు ప్రతి ఇంటిని సర్వే చేశామని చెప్పారు. కరోనా బాధితుడి కుటుంబసభ్యులు, పని మనిషికి కూడా వైద్య పరీక్షలు చేయడంతో పాటు.. వైద్యుల పర్యవేక్షణలో కూడా ఉంచామని పేర్కొన్నారు. ఏపీలో ప్రస్తుతం మరెక్కడా కరోనా వైరస్‌ కేసులు నమోదు కాలేదన్నారు. 13 జిల్లాల్లో 56 ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో మరో 300 బెడ్లను సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఇటలీ నుంచి ఏపీకి 238 మంది ప్రయాణికులు వచ్చారని.. వారిని గుర్తించి ప్రత్యేక వైద్య పరీక్షలు జరుపుతున్నామని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. సిమ్స్‌లో కరోనా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని జవహర్‌రెడ్డి పేర్కొన్నారు.