టీటీడీ సంచలన నిర్ణయం

టీటీడీ సంచలన నిర్ణయం

కంపార్ట్‌మెంట్లులో భక్తులు వేచి ఉండే పద్దతికి స్వస్తి
ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం రద్దు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ ని‍ర్ణయం
తిరుపతి : ప్రమాదకర కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నివారణకు భక్తులు వేచి ఉండే పద్దతికి తాత్కాలికంగా స్వస్తి పలికింది. టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకెన్లు కేటాయించి భక్తులను దర్శనానికి పంపాలని టీటీడీ నిర్ణయించింది. కంపార్ట్‌మెంట్లులో వేచి ఉంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కడప జిల్లాలోని ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణ భూమిపూజను వాయిదా వేసింది. అలాగే కరోనా నివారణను కోరుతూ.. శ్రీశ్రీనివాస శాంతి ఉత్సవ సహిత ధన్వంతరి మహాయాగంను నిర్వహించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. మరోవైపు విశేషపూజ, సహస్త్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం సేవలను ముందుగా బుక్ చేసుకున్న భక్తులకు తేది మార్చుకునే అవకాశం, లేదా బ్రేక్ దర్శనంకు వెళ్లే వెసులుబాటును టీటీడీ కల్పించింది. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది ఒకేచోట గుమికూడటం మంచిదికాదని భావించిన టీటీడీ ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఈ మేరకు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వివరాలను వెల్లడించారు. ‘దేశ, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. వైరస్‌ వ్యాప్తి కాకుండా నిరంతరం చర్యలు చేపడుతున్నాం. ఎక్కువ మంది ఒకేచోట గుమికూడటం మంచిది కాదు. దీని వల్ల త్వరగా వైరస్ వ్యాపిస్తుంది.

తిరుమలని సెక్టార్ లుగా విభజించి, శుభ్రత చర్యలు చేపట్టాము. గదులు కాళీ చేసిన వెంటనే పూర్తిగా సుద్ది చేసిన తర్వాత మరొకరికి కేటాయిస్తున్నాము. అనుమానితులను అలిపిరి, నడకదారిలో గుర్తించి వైద్య చికిత్సకోసం తరలించే ఏర్పాటు చేశాం. కరోనా వైరస్ ప్రభావితం వల్లా ఒకే చోట ఆరు గంటలు ఉండటం మంచిది కాదు. సీతారాముల కళ్యాణం రద్దు చేసి, లైవ్ ద్వరా కళ్యాణం వీక్షించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మంగళవారం నుంచి టీటీడీ కేటాయించే సమయంలో మాత్రమే దర్శనానికి రావాలి. భక్తులు కూడా సహకరించాలి’ అని తెలిపారు.