కరోనాపై విజయం సాధిస్తాం, ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

కరోనాపై విజయం సాధిస్తాం, ఉగాది శుభాకాంక్షలు
తెలిపిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

దేశ ప్రజలందరికీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రకృతి కొత్త రెక్కలు తొడిగి మళ్లీ తన పరిమళాలు వెదజల్లే వసంతరుతువు ఆగమనాన్ని సూచించే ఉగాది పండగ.. అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

సంప్రదాయ నూతన సంవత్సరం ప్రజల్లో కొత్త విశ్వాసాన్ని నింపి భారతదేశం, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాన్ని సూచించే దిశగా ముందుకు నడిపిస్తుందని ఆకాంక్షిస్తున్నాను. కరోనాను తరిమేసేందుకు ప్రభుత్వాలు, వైద్యులు చేస్తున్న ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతును అందజేద్దాం. మనం చేసే ఈ ప్రయత్నంతో కరోనాపై విజయం సాధిస్తామని నేను విశ్వసిస్తున్నాను.

ప్రపంచమంతా కరోనా మహమ్మారి బారిన పడి విలవిల్లాడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు, వైద్య నిపుణులు చేస్తున్న సూచనలు, జాగ్రత్తలను నూటికి నూరుశాతం పాటిద్దాం. మనల్ని మనం కాపాడుకోవడంతోపాటు పక్కవారిని కూడా చైతన్య పరచాల్సిన బాధ్యతను తీసుకుంటామని ఉగాది సందర్భంగా ప్రతినబూనుదాం. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సహాయం కోసం ఎదురుచూస్తున్నవారికి, పొరుగువారికి అవసరమైన సాయం చేయండి. భారతదేశంతోపాటు ప్రపంచ భవిష్యత్తును పదిలంగా ఉంచేందుకు మనమంతా సానుకూల, నిర్మాణాత్మక ఆలోచనాధోరణితో ముందడుగేద్దాం.