ఊహాన్ ఊరు మేల్కోందెలా?? మనమెలా??

ప్ర‌పంచాన్నే ప్రాణ భయంతో వణికిస్తోన్న క‌రోనా వైర‌స్ పుట్టిల్లు ఊహాన్ నగరం బాహ్య లోకంలోకి వ‌చ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది. క‌రోనా వైర‌స్‌కు సంబంధించి కొత్త కేసులు న‌మోదు కాక‌పోవ‌డంతో 76 రోజుల తర్వాత చైనా సర్కారు లాక్‌డౌన్ తాళాలు తెరిచింది. స్వీయ నియంత్ర‌ణ‌ను ద‌శ‌ల‌ వారీగా ఎత్తివేస్తూ వ‌చ్చినా డ్రాగన్ ఇప్పుడు మొత్తానికి లాక్‌ డౌన్ ఎత్తివేస్తున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించ‌డంతో ఆ దేశ ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే క‌రోనా వైర‌స్‌తో ఆ దేశం పెట్టిన చిచ్చు ప్ర‌పంచ వ్యాప్తంగా రగులుతూ మంటలు ఎగిసిప‌డుతూనే ఉన్నాయి. ల‌క్ష‌లాది మందికి వైర‌స్ సెగలు భగభగలు త‌గ‌ల‌గా వేల సంఖ్య‌లో ఆహుతులయ్యారు.

లాక్ డౌన్ ఎత్తి వేత త‌రువాత వైర‌స్ పుట్టిల్లు వుహాన్ ప్ర‌జ‌ల్లో మునుప‌టి ఉత్సాహం క‌నిపించ‌డం లేదు. పైకి ఉత్సాహంగా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ, వైర‌స్ భ‌యం నీడ‌లా వెంటాడుతూనే ఉంది. ఈ సుదీర్ఘ లాక్‌డౌన్‌ కాలంలో ఊహాన్ న‌గ‌ర ప్రజలు ఎన్నో కష్ట నష్టాల కోర్చి నిబ్బరంగా నిలిచింది. క‌రోనా వైర‌స్‌ సుమారు 50 వేల మందిని బాధితుల‌ను చేయ‌గా దాదాపు రెండున్న‌ర వేల‌ మందికి మ‌ర‌ణ‌శాస‌నాన్ని లిఖించింది. లాక్‌డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలోనే గ‌త నెల 10న ఊహాన్‌కు వ‌చ్చిన చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌ ప్రజల ధీరత్వాన్ని ప్రశంసించి మనోధైర్యాన్ని ఇచ్చారు.

ఊహాన్ కేంద్రంగా వ్యాపించిన క‌రోనా వైరస్‌ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటిన్నర మందికి సంక్ర‌మించింది. దాదాపు ఎనభై వేల మంది ప్రాణాలను బ‌లితీసుకుంది. ఆంక్ష‌లు, నిర్భందాలు, క‌ఠోర ప‌రిశ్ర‌మ‌, సుదీర్ఘ ప్ర‌యాసాల అనంత‌రం లాక్‌డౌన్ ఎత్తివేత ద్వారా వుహాన్ న‌గ‌రం సాధించుకున్న విజ‌య‌వం, వైరస్‌పై యావ‌త్ ప్ర‌పంచం సాగిస్తున్న పోరాటానికి స్ఫూర్తినిస్తుంది. ఈ వైరస్‌ను జయించడం సాధ్యమేననే ధైర్యాన్ని అంద‌రికి క‌లిగిస్తోంది.
క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి చైనా అనుస‌రించిన మార్గాల‌పై యావ‌త్ ప్ర‌పంచం దృష్టిని సారించాల్సిన అస‌వ‌రం ఉంది. మనం మాత్రం ఈ అనుభవాలను పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.