USAలో కరోనా ఉద్యోగ కష్టాలు సంక్షోభం

క‌రోనా వైర‌స్ ధాటికి అగ్ర‌రాజ్యం అమెరికా ఉద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. క‌రోనా వైర‌స్ విజృంభ‌న‌తో ఆ దేశంలో అనేక సంస్థ‌లకు తాళాలు ప‌డ్డాయి. అంత‌గా ప్రాధాన్యం లేని వ్యాపారాల‌కు 48 రాష్ట్రాలు తెర దించాయి. ప్ర‌తి ప‌ది మందిలో ఒక‌రు ఉద్యోగాన్ని కోల్పోతున్నారు. దీంతో నిరుద్యోగుల సంఖ్య వాయువేగంతో పెరిగిపోతోంది. గ‌త 7 ద‌శాబ్దాల నుంచి పోల్చి చూస్తే ఇదే అతి పెద్ద ఉద్యోగ సంక్షోభంగా తెలుస్తోంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి అనంత‌రం గ‌త వారం అమెరికాలో నిరుద్యోగ భృతి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌వారి సంఖ్య 66 లక్ష‌ల‌కు చేరుకుంది.

గ‌డిచిన మూడు వారాల్లో నిరుద్యోగ భృతిని కోరుతున్న వారి సంఖ్య1‌.66 కోట్ల‌కు చేరింది. క‌రోనా వైర‌స్ కాటుకు అమెరికాలో 16వేల మందికి పైగా మృత్యువాత ప‌డ్డారు. 4.6 ల‌క్ష‌ల మందికి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో చాలా సంస్థలు మూతపడ్డాయి. 48 రాష్ట్రాలు ప్రాధాన్యం కాని వ్యాపారాలను ఇప్ప‌టికే మూసివేశాయి. ఈ నెలలో 2 కోట్ల మందికి పైగా అమెరికన్లు ఉద్యోగాలు పొగొట్టుకునే అవకాశముందని అక్క‌డి ప‌రిస్థితులు తెలుపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమ‌ల్లో ఉండ‌డం, ప‌రిశ్ర‌మ‌లు మూత ప‌డ‌డం, వ్యాపారాల్లేక ఆర్ధిక లావాదేవీలు స్థంభించిపోవ‌డంతో ఆదాయం లేక‌ రెస్టారెంట్లు, హోటళ్లు, డిపార్ట్‌మెంట్‌ స్టోర్లు, చిన్న వ్యాపార సంస్థ‌లు త‌మ ఉద్యోగుల‌కు ఉధ్వాస‌న ప‌లుకుతున్నాయి. ఏప్రిల్‌లో నిరుద్యోగిత రేటు 17 శాతానికి చేర‌వ‌చ్చ‌ని అంచనా. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ఫెడరల్‌ రిజర్వ్‌ మరో 2.3 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది.లాక్‌డౌన్‌‌ కారణంగా వ్యాపారులు, ప్రజలు, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు నగదు కొరత ఎదుర్కొంటున్నాయి. ఈ ప్యాకేజీతో అమెరికాకు కొంత వెసులుబాటు క‌ల‌గ‌నుంది.