యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా హెల్త్ కేర్ అధ్యయనం

యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా హెల్త్ కేర్ అధ్యయనం

కరోనా మహమ్మారిని నియంత్రించాలంటే, కేవలం ఒక్క మాస్క్ పెట్టుకుంటే సరిపోదని, రెండు మాస్క్ లు పెట్టుకోవాల్సిందేనని యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా హెల్త్ కేర్ నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా వైరస్ నియంత్రణ క్లిష్టతరమైన సమయంలో, డబుల్ మాస్క్ ను ధరించడం వల్ల ముక్కు ద్వారా వైరస్ లోపలికి వెళ్లకుండా చేయవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ అధ్యయన ఫలితాలను జామా ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్ ప్రచురించింది.రెండు మాస్క్ లను ధరిస్తే, వైరస్ శరీరం లోపలికి వెళ్లలేదని తేల్చిన పరిశోధకులు, ఒక మాస్క్ లో పొరల సంఖ్యను పెంచడం వల్ల ఉపయోగం ఉండదని వెల్లడించారు. మాస్క్ లలో ఉన్న ఖాళీలు పూడ్చి, ముఖానికి బిగుతుగా ఉంటేనే వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చని తెల8ిపారు. మెడికల్ ప్రొసీజర్ మాస్క్ లు మాత్రమే రక్షణ కల్పించలేవని అధ్యయనంలో పాల్గొన్న యూఎన్సీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అంటువ్యాధుల విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ ఎమ్లీ సిక్ బర్డ్ బెన్నెట్ వ్యాఖ్యానించారు.ఓ సర్జికల్ మాస్క్ తో కలిపి, వస్త్రంతో తయారు చేసిన మాస్క్ ను ధరిస్తే కరోనా వైరస్ కు దూరంగా ఉండవచ్చని, ముఖాల్లో తేడాను బట్టి కూడా మాస్క్ ల సామర్థ్యం భిన్నంగా ఉంటుందని గుర్తించామని ఆయన తెలిపారు. సర్జికల్ మాస్క్ లు 60 శాతం వరకూ, వస్త్రంతో తయారు చేసిన మాస్క్ లు 40 శాతం వరకూ పని చేస్తున్నాయని, ఈ రెండూ కలిపి ధరిస్తే, మరో 20 శాతం వరకూ ప్రభావం ఉంటుందని వెల్లడించారు. ముఖానికి గట్టిగా అతుక్కుని ఉండే మాస్క్ లతో కరోనాను దూరం పెట్టవచ్చని తేల్చారు.ఇక వదులుగా ఉండే మాస్క్ లతో ఏ మాత్రమూ ఉపయోగం ఉండదని, ఇదే సమయంలో ముక్కు, మూతిని మూసేసేలా అమరే ఒక్క మాస్క్ అయినా మెరుగైన ఫలితాలను పొందవచ్చని ఎమ్లీ సిక్ బెర్డ్ బెన్నెట్ వ్యాఖ్యానించారు. వైరస్ ను నివారించాలంటే, మాస్క్ ధరించడం అత్యంత ముఖ్యమని తమ అధ్యయనంలో వెల్లడైనట్టు తెలిపారు.