కేంద్రం కోవిడ్-19 బులెటిన్ (ఏప్రిల్ 14th 2020)

దేశంలో కోవిడ్-19 నివారణ, నియంత్రణ మరియు నిర్వహణ కోసం భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి అనేక చర్యలు చేపట్టింది. వీటిని క్రమం తప్పకుండా ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు జాతి నుద్దేశించి ప్రసంగిస్తూ, ఈ మహమ్మారిని తిప్పికొట్టడానికి ఏడు సూత్రాలు పాటించాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఆ సూత్రాలు :

1. మీ ఇళ్లలోని పెద్దలు, ప్రత్యేకించి దీర్ఘకాలిక వ్యాధులున్న వారిపట్ల అత్యంత జాగ్రత్త వహించండి.

2.లాక్ డౌన్ నిబంధనలను పూర్తిగా పాటించండి, సామాజిక దూరం పాటించండి. ఇంట్లో తయారుచేసుకున్న మాస్కులు తప్పకుండా ధరించండి.

3. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆయుష్‌ మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించండి. “కధా” వేడి నీటిని తరచుగా త్రాగండి.

4. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధం కోసం ‘ఆరోగ్య సేతు’ మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి.

5. మీ చుట్టూ ఉన్న పేద కుటుంబాల యోగక్షేమాలను పట్టించుకోండి. ప్రత్యేకించి వారి ఆహార అవసరాలు తీర్చడానికి ప్రయత్నించండి.

6. మీ వ్యాపారాలు, పరిశ్రమలలో పనిచేసేవారిపై కరుణతో మెలగండి. వారికి జీవనోపాధి లేకుండా చేయవద్దు.

7. కరోనాపై పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది వంటి మన జాతీయ యోధులను అమితంగా గౌరవించండి.

దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను పటిష్టపరచడానికి రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిసి కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిరంతరం, కఠోర దీక్షతో పనిచేస్తోంది. ఇప్పటి వరకు, మొత్తం 602 ఆసుపత్రులను కోవిడ్-19 కోసం ప్రత్యేకంగా కేటాయించారు. ఈ ఆసుపత్రుల్లో 1,06,719 ఐసోలేషన్ పడకలు, 12,024 ఐ.సి.యు. పడకలను ఏర్పాటు చేశారు.

జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడానికి భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారుని కార్యాలయం మార్గదర్శకాలను జారీ చేసింది. మరుగు దొడ్లు, బట్టలు ఉతికే ప్రదేశాలు, స్నానాలు చేసే ప్రదేశాలను ఒకరి కంటే ఎక్కువ మంది ఉపయోగించే ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో చేపట్టవలసిన పారిశుధ్యం, పరిశుభ్రత చర్యలను ఈ మార్గదర్శకాల్లో ప్రధానంగా వివరించారు.

నిన్నటి నుండి 1211 మందికి కొత్తగా కోవిడ్-19 సోకగా, 31 మంది మృతి చెందారు. ఇంతవరకు మొత్తం 1036 మంది చికిత్స అనంతరం కోలుకుని ఆసుపత్రుల నుండి ఇళ్లకు వెళ్లారు.

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు, సలహాలు, సూచనలపై ప్రామాణికమైన, తాజా సమాచారం కోసం ఈ వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి: https://www.mohfw.gov.in/.

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు[email protected]

ఇతర సందేహాలు, అనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు. [email protected] .

కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలు, సమస్యలు, సమాచారానికైనా, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075ను సంప్రదించవచ్చు.

వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా మరియు ఇతర సమాచారం కోసం ఈ వెబ్ సైట్ ని చూడండి.
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf.