అగ్ర‌రాజ్యం అమెరికా అల్లాలడుతోంది.

క‌రోనా వైర‌స్ కోరల్లో అమెరికా అగ్గిమీద గుగ్గిలంలా మాడిపోతోంది. USAలో రెండున్నర ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా వైర‌స్ బారిన అమెరికన్లు పడ్డారు. 6,500 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ప్ర‌తి ఆరు నిమిషాల‌కు ఒక‌రు మృత్యువాత ప‌డుతున్న‌ట్టు గ‌ణాంకాలు తెలుపుతున్నాయి. ఏప్రిల్ 3న ఒక్కరోజే 1500 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. క‌రోనా కేసుల న‌మోదు తీవ్ర అనారోగ్యానికి గురై మృత్యువాత ప‌డుతున్న సంఖ్య వాయువేగంతో పెరుగుతుండ‌డం, అంతేకాదు అక్క‌డి జ‌నాభాలో 85% జనం ఇంటికే పరిమితమవడంతో ప‌రిస్థితుల తీవ్ర‌త‌ను తెలియజేస్తోంది. అమెరికాలో రానున్న మూడు వారాల్లో పరిస్థితులు మ‌రింత తీవ్రంగా మార‌నున్నాయి. దాదాపు ఒక్క USAలోనే 10 ల‌క్ష‌ల మంది క‌రోనా వైర‌స్ బారిన ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని నిపుణుల అంచ‌నా వేస్తున్నారు.

 

ఇప్పటికే వైద్య సంక్షోభంతో వైద్య‌ సిబ్బంది చేతులెత్తేసే ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. మృతదేహాలను భద్రపరిచేందుకు లక్ష సంచులు కావాలని అమెరికా డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్‌ ‘ఫెమా’ అక్కడి సైన్యాన్ని కోరింది. ఓ వైపు ప్రాణాల‌ను తీస్తున్న క‌రోనా వైర‌స్‌ మరోవైపు నిరుద్యోగ పరిస్థితులను సవాళ్లుగా మారుస్తోంది. గ‌డిచిన రెండువారాల్లో దాదాపు కోటి మంది అమెరిక‌న్లు నిరుద్యోగులుగా మారారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో కార్పోరేట్ సంస్థ‌ల్లో శాశ్వత, తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల ప‌రిస్థితి కూడా ఆందోళ‌న‌క‌రంగా మారింది. ఇప్ప‌టికే చాలా మందికి కాంట్రాక్టును పొడిగించడంలేదు అక్కడి కార్పోరేట్ సంస్థ‌లు.

గత వారంలో 66.5 లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగ భృతి కోసం ద‌ర‌ఖాస్తులు చేసుకునేవారి సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. ఇంతటి విపత్కర పరిస్థితులు ఎదురవుతోన్నా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌లో అహంకారం ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. తాను మాత్రం మాస్క్ ధరించుకుని, రెండు సార్లు కరోనా వైరస్ పరీక్షలు చేసుకుని, అమెరికా పౌరులు స్వ‌చ్ఛందంగా మాస్కులు ధ‌రించ‌వ‌చ్చ‌ని ట్రంప్ చేసిన వ్యాఖ్య‌లు స‌ర్వ‌త్రా చ‌ర్చానీయంశం అయ్యాయి. ఏదేమైనా నిర్లక్ష్యం వహిస్తే ఏమి చవి చూడాల్సి వస్తుందో అమెరికాను చూసి నేర్చుకోవాలి.