కరోనాపై పోరులో ప్రసార మాధ్యమాల అసమాన పాత్ర మనోగతం ముప్పవరపు వెంకయ్య నాయుడు

దీన్ని ఎందుకు చదవాలి?

కరోనాతో కలిసి జీవిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, కాలం మీద ఈ మహమ్మారి తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. నిరంతర పరిమితుల మధ్య మన చుట్టూ ఉన్న ప్రపంచంతో కలిసి ముందుకు సాగటమే మన ముందున్న అతి పెద్ద సవాలు. మన పొరుగున ఉన్న స్థానిక గ్రామాలు, పట్టణాలు, వివిధ రాష్ట్రాలు, మరియు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి, దాని ప్రతికూల ప్రభావాల గురించి తెలుసుకుంటూ ఉండటం మనలో ఆందోళనకు కారణం అవుతోంది. వైరస్ తీరు ఎలా ఉంటుంది, అది మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది, మన పరిసరాల్లో ఎంత సేపు ఉంటుంది లాంటి అంశాల గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కరోనా నేపథ్యంలో మనకు కలిగే ఇలాంటి అనేక రకాల సందేహాలకు, ఆందోళనలకు సబంధించి సమాధానాలు పొందగలిగే ఏకైక మార్గం ప్రసార మాధ్యమాలే. కాబట్టి ఈ విషయంలో నా మనోగతాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను.


నావల్ కరోనా వైరస్ వ్యాప్తి అనంతర కోవిడ్ -19 మహమ్మారి సంక్షోభం ఈ మధ్యకాలంలో అంతకు ముందెప్పుడూ మానవాళి చూడనిది. ఇది ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవనాన్ని కుదుపునకు గురి చేసింది. కంటికి కనిపించని ఈ మహమ్మారిని ఎదుర్కోవటంలో మనమంతా మున్ముందు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోవిడ్ వ్యాప్తి, మరణాల సంఖ్య రోజురోజుకూ కొద్దిగా పెరుగుతూనే ఉంది. అదే సమయంలో కోలుకుంటున్న వారి సంఖ్య కూడా బాగా పెరుగుతుండడం ఊరటనిచ్చే అంశం. ఈ నేపథ్యంలో మన సామాజిక జీవనంలో పరిమితులు ఇంకెంత కాలం ఉండబోతున్నాయో మనం చెప్పలేని పరిస్థితి.
మన జీవితాలు గతంలో వలే కొనసాగే పరిస్థితి లేదని, ఈ మహమ్మారి నుంచి స్వీయ రక్షణ కోసం గతంతో పోలిస్తే భిన్నంగా జీవించాల్సిన అవసరం ఉందనే విషయం ఈ ఏడాది జనవరిలోనే మనకు స్పష్టంగా తెలిసివచ్చింది. ఈ సరికొత్త సాధారణ జీవనం నేపథ్యంలో వైరస్ గురించి మరింత అవగాహన, దాని వ్యాప్తి, నివారణ తదితర అంశాలకు సంబంధించిన పరిజ్ఞానం, దానికి సంబంధించిన ఔషధాలు, రాకుండా కట్టడి చేసుకోగల ముందస్తు నివారణ చర్యలు లాంటి పూర్తి సమాచారం అత్యంత ఆవశ్యకం. ఈ మహమ్మారి బారి నుంచి ప్రజలు తమను తాము కాపాడుకునేందుకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందాల్సిన అవసరం ఏర్పడింది. 21వ శతాబ్ధంలో మన జీవితాలు ముందుకు సాగడం అత్యంత క్లిష్టమైన ఈ పరిస్థితుల్లో మనకు కావలసిన సమాచారాన్ని అందజేసే అత్యున్నతమైన భారం ప్రభుత్వంతో పాటు మీడియా భుజాల మీద పడింది. నా దృష్టిలో మీడియా పాత్ర బాగా పెరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులతో కలిసి మీడియా ముందు వరుసలో నిలబడి కరోనాతో పోరాటం చేస్తోంది.


సరైన సమాచారం అందించే చర్యల ద్వారా, అభివృద్ధి దిశగా సాధికార మార్గాన్ని చూపే వ్యవస్థగా (MEDIA – Means of Empowerment for Development through Informed Actions) ఓ సందర్భంలో మీడియాను నేను అభివర్ణించాను. ప్రస్తుతం పరీక్షా కాలంలో D అక్షరానికి నేను చెప్పిన అభివృద్ధి (డెవలప్ మెంట్) అనే అర్థం పూర్తిగా మారిపోయింది. బహుశా విపత్తు నిర్వహణ (Disaster management)గా అర్థం చేసుకోవచ్చు. మరో విధంగా చెప్పాలంటే దీన్ని మహమ్మారితో వ్యహరించటం(Dealing with the pandemic) గానూ అనుకోవచ్చు. ప్రజల సాధికారతకు ఓ ముఖ్యమైన సాధనంగా మీడియాకు ఇంతకు ముందు నేను ఇచ్చిన నిర్వచనం ఏ పరిస్థితికైనా వర్తిస్తుంది. ప్రస్తుత మహమ్మారి నేపథ్యంలో ఇది మరింత ఎక్కువ.

కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి మీడియా పాత్ర
ఎటూ పాలు పోని స్థితిలో ఈ వైరస్ వ్యాప్తి వెనుక కారణాలు ఏమిటి, తదుపరి పర్యవసానాలు ఏమిటి, ఇంకెంత కాలం ఈ వైరస్ గురించి ఆందోళన చెందాలి లాంటి ప్రశ్నల నేపథ్యంలో మనమంతా సమాచారం కోసం మీడియా వైపు చూశాము. ఈ ఏడాది జనవరి నుంచి వార్తా పత్రికలు, టెలివిజన్ ఛానళ్ళు, సామాజిక మాథ్యమాలు మన అవగాహనను మరింత పెంచే దిశలో ముందడుగు వేశాయి. ఈ కరోనా మహమ్మారి విస్తృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడం, అవసరమైన విధంగా అవగాహన కల్పించడం, పూర్తి వివరాలు తెలియజేయటం లాంటి అంశాల్లో మీడియా పోషించిన అపూర్వమైన పాత్రను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.
గత ఏడాది డిసెంబర్ లో ఈ వైరస్ వ్యాప్తి జరుగుతున్న నేపథ్యంలో వూహాన్ నుంచి డబ్ల్యూ.హెచ్.ఓ. వరకూ మీడియా ముందు వరసులో నిలబడి సమాచారాన్ని, దృక్పథాలను, అపోహలకు సంబంధించిన స్పష్టతలను, కథనాలను, ప్రముఖుల అభిప్రాయాలను, ఎప్పటికప్పుడు ప్రపంచం మీద చూపుతున్న ప్రభావాన్ని తెలియజేస్తూ వచ్చింది.
ప్రత్యేకించి నేను వార్తా పత్రికలను ఎప్పటికప్పుడు అనుసరిస్తూ ఉంటాను. కరోనా విషయంలో వారు తీసుకున్న శ్రద్ధ, ఇచ్చిన ప్రాధాన్యత యుద్ధానికి సంబంధించి ఇచ్చే వార్తల స్థాయిని కూడా అధిగమించాయి. సమాచారం కోసం ఎదురు చూసే పాఠకులకు మరిన్ని కొత్త అంశాలు తెలియజేసే ఉద్దేశంతో మరెన్నో కొత్త మార్గాలను కూడా ప్రారంభించి, కొనసాగించారు. ఈ వ్యాధికి సంబంధించిన వివిధ అంశాలకు సంబంధించి విస్తృతమైన విశ్లేషణ మరియు దాని ప్రభావాలకు సంబంధించిన సమాచారం నేటికీ ఓ ఉద్యమంగా కొనసాగిస్తూనే ఉన్నారు.
పత్రికలు, టెలివిజన్ ఛానళ్ళు నేటికీ మాస్క్ లు ధరించాల్సిన అవసరం, భౌతిక దూరంగా పాటించాల్సిన ఆవశ్యకత, తరచూ చేతులు కడుక్కోవడం, పెద్ద సమావేశాలు నిర్వహించకుండా ఉండటం లాంటి అంశాల మీద ప్రచారాన్ని నిర్వహిస్తూనే ఉన్నాయి. ఈ మహమ్మారి నుంచి స్వీయ రక్షణ కోసం అత్యంత ఆవశ్యకమైన నివారణ చర్యలివి. శారీరక వ్యాయామం, జీవన పద్ధతులు, సరైన పోషకాలు గల ఆరోగ్యకరమైన ఆహారం, ఆందోళన తగ్గడానికి, సాంత్వన కలగడానికి ఆధ్యాత్మిక చింతన తదితర అంశాలపై పత్రికలు ప్రజలకు సమాచారం అందించి మార్గదర్శనం చేస్తున్నాయి.
వలస కార్మికులు, పేదలు వంటి మరింత బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై టెలివిజన్ ఛానళ్ళు అందించిన క్షేత్ర స్థాయి నివేదికలు (గ్రౌండ్ రిపోర్ట్) ఇప్పటికీ సమాజంలో ఉన్న అసమానతల స్థాయిని ఎంతో హృద్యంగా వివరించాయి. అయితే మీడియాకు సంబంధించిన కొన్ని విభాగాలు ముఖ్యంగా టెలివిజన్ మాత్రం ఇక నుంచి పరిస్థితిని ఉన్నది ఉన్నట్టుగా తెలియజేసే ప్రయత్నాలు చేయాలే తప్ప, సంచలనాత్మక కథనాలు ప్రసారం చేయాలనే దృష్టితో అనవసరమైన భయాందోళనలను సృష్టించటం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ప్రజలు తమ మనసుల నుంచి కరోనా భయాన్ని ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవదూరమైన సంచలన అంశాలు ఘోరమైన పరిణామాలకు దారి తీస్తాయి. అందుకే టెలివిజన్‌లోని కొన్ని విభాగాలకు సంబంధించి వారు జాగ్రత్త వహించాలి. వాస్తవ పరిస్థితులను తెలియజేయడం ద్వారా, ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించాలి.
మిగతా వాళ్ళందరిది ఒక పరిస్థితి అయితే, సామాజిక మాధ్యమాలది మరో కథ. మరింత ప్రత్యేకమైన దీని స్వభావం కారణంగా లాక్ డౌన్ సమయంలో సులభంగా అందరికీ అందుబాటులో ఉండేందుకు ఇది చాలా సహాయపడిందన్నది నిర్వివాదాంశం. ఏదేమైనా ఈ మహమ్మారి గురించి అనధికారిక, ధృవీకరణ కాని సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడం ద్వారా అనేక అపోహలకు తావు ఇవ్వడమే గాక, ఎన్నో ప్రతికూల పరిస్థితులకు కూడా కారణమౌతోంది. దీన్ని లెక్కించలేము కూడా. అందుకే సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్న వారు నిజానిజాలు తెలుసుకోకుండా సమాచారాన్ని వ్యాప్తి చేయకూడదు. ఈ విషయంలో స్వీయ నియంత్రణ చాలా అవసరం.
పూర్తి ప్రామాణికమైన సమాచారాన్ని మాత్రమే వ్యాప్తి చేయాలనే విషయాన్ని నెటిజన్లు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ధృవీకరించిన సమాచారం ఎప్పుడూ సమర్థవంతమైన విస్ఫోటన సామగ్రి కంటే బలమైనది (information with Conformation is more than ammunition) అని నేను ఎన్నో మార్లు చెబుతూ వచ్చాను. అది సానుకూలమైన పరిస్థితులను కల్పిస్తుంది. అలా కాకుండా ఎలాంటి ధృవీకరణ లేని సమాచారం వల్ల అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది.

ప్రభుత్వాలు మరియు ప్రజల మధ్య వారధి
ప్రజాస్వామ్య సౌధానికి నాలుగో స్తంభంగా మీడియాను చెబుతూ ఉంటారు. అదే విధంగా పార్లమెంటరీ సంస్థలు, పాలకులు మరియు ప్రజల మధ్య పరస్పర సమాచార వ్యాప్తిలో మీడియాను వారధిగా చెబుతారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఈ పాత్ర మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
కరోనా రక్కసికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి పరిధుల్లో నాయక పాత్రను పోషించాయి. ఎప్పటికప్పుడు పెరుగుతున్న కేసులు, సేకరించిన నమూనాల గురించి ప్రతి రోజూ సంక్షిప్త సమాచారం అందించడం, వైరస్ నేపథ్యంలో అభివృద్ధి చేసిన, అనుసరిస్తున్న వ్యూహాలు, క్లినికల్ చికిత్స ప్రోటోకాల్స్, మందుల లభ్యత, ఆస్పత్రుల్లో పడకలు, మాస్కులు, పి.పి.ఈ. కిట్స్ మొదలైన వాటితో పాటు వ్యాక్సిన్ దిశగా సాగుతున్న ప్రయత్నాలు, ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీలు, పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రజల సాధికారత దిశగా ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలు… ఇలా ఆందోళనకర పరిస్థితుల్లో ప్రజలకు ఎన్నో విషయాల పట్ల అవగాహన కల్పించే దిశగా ప్రభుత్వాలతో పాటు మీడియా పోషించిన పాత్ర ప్రశంసించదగినది. ప్రభుత్వాలు, ప్రజల మధ్య మీడియా లేకున్నా, చొరవ తీసుకోకున్నా పరిస్థితి శూన్యతకు దారి తీసేది.
విలేకరులు ముసుగులు ధరించి, వలస కార్మికుల సమస్యలు, ప్రజల ఇతర దైనందిన సమస్యల విషయంలో క్షేత్ర స్థాయి పరిస్థితుల వాస్తవాలను తెలియజేసే ప్రయత్నాలు కొనసాగించారు. ఈ ప్రక్రియలో చాలా మంది విలేకరులు కరోనా బారిన పడగా, కొందరు ప్రాణాలు కోల్పోయారు కూడా. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కర్తవ్య నిష్టకు కట్టుబడి ప్రాణాలు కోల్పోయిన మీడియా సిబ్బందికి నివాళులు అర్పిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటంలో మీడియా సిబ్బంది కూడా ముందు వరుస యోధులుగా నిలబడి, సైనికులతో సమానమైన చొరవ చూపారన్నది నిర్వివాదాంశం.

సవాళ్ళ మధ్య విద్యుక్త ధర్మాన్ని కొనసాగించిన మీడియా
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. సేవా రంగంలో ఓ ముఖ్యమైన విభాగంగా విభాగమైన మీడియా కూడా ఈ పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు కారణంగా ప్రకటనలు తగ్గిపోయాయి, ఆదాయాలు పడిపోయాయి. కార్యకలాపాల స్థాయిని విస్తృతం చేసి తీరాల్సిన సమయంలో మీడియా సిబ్బంది వేతనాల్లో కోత విధించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ విస్తృతంగా ఆలోచిస్తే, అత్యంత అవసరమైన పరిస్థితుల్లో ప్రజలను శక్తి వంతం చేయాలనే లక్ష్యంతో మీడియా ముందుకు సాగింది. వారి చొరవను, సంకల్ప స్ఫూర్తిని నేను అభినందిస్తున్నాను.
అంతేనా మీడియాకు కొత్త సమస్యలు ఎదురయ్యాయి. వార్తా పత్రికలు కూడా వైరస్ వాహకాలు అనే ఉద్దేశంతో కొన్ని రోజులు వాటి పంపిణీ ఆగిపోయింది. ఈవిషయంలో కొంత స్పష్టత వచ్చిన తర్వాత పంపిణీ తిరిగి కొనసాగింది. అయితే ఇప్పటికీ కొంత మంది పాఠకులు వీటిని తీసుకోవటానికి సందేహిస్తున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. పత్రికలు వైరస్ వాహకాలు కాదు. నేను రోజూ పత్రికలు చదువుతూనే ఉన్నాను.

మహమ్మారి నేపథ్యంలో చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న మీడియా
కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో మీడియా చేసిన మరో ముఖ్యమైన పని ఏమిటంటే, ఈ వైరస్ సామాజిక, ఆర్థిక ప్రభావాల గురించి, భూమి మీద దాని అభివ్యక్తి గురించి ప్రతి వివరాన్ని పత్రాలుగా పొందుపరించింది. ఫలితంగా ఈ మహమ్మారికి సంబంధించిన ప్రధాన చరిత్రకారుడిగా మారింది. భవిష్యత్ లో సమాచార క్రోడీకరణకు అధికంగా మీడియా మీదే ఆధారపడే పరిస్థితి ఏర్పడింది.

అజెండా ఏర్పాటు
మహమ్మారికి సంబంధించిన వివిధ అంశాలను లేవనెత్తడం ద్వారా మరియు వాస్తవిక, విశ్లేషణాత్మక పద్ధతిలో ప్రచురించడం ద్వారా ఈ మహమ్మారి నేపథ్యంలో పార్మమెంటరీ సంస్థల నిర్వహణ మరియు చర్చల విషయంలో మీడియా ఒక అజెండాను సూచించింది. ఈ విషయంలో మేము ముందుకు సాగటంలో, సంబంధిత సమస్యలను లేవనెత్తే విషయంలో మీడియా నివేదికలు సూత్ర ప్రాయమైన సూచనలుగా ఉపయోగపడ్డాయి.

పార్లమెంటరీ పరిశీలన
అజెండా గురించి మీడియా తెలియజేసిన విషయాలను ప్రస్తావించిన తర్వాత, మహమ్మారి విషయంలో పార్లమెంటరీ పరిశీలన గురించి తెలియజేయడం సముచితంగా ఉంటుంది. మళ్ళీ తరచుగా మీడియా ప్రస్తావన ఉంటూనే ఉంటుంది.
పార్లమెంట్ చివరి బడ్జెట్ సమావేశాన్ని ముందుగా అనుకున్న షెడ్యూల్ కంటే కొద్ది రోజుల ముందే తగ్గించాల్సి వచ్చింది. ఎందుకంటే ఎంపీలు ఈ సంక్షోభ సమయంలో ప్రజలతో ఉండాలని కోరుకున్నారు. ఉభయ సభలను 2020 మార్చి 23న వాయిదా వేయడం జరిగింది. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం పార్లమెంట్ చివరి సమావేశం జరిగిన ఆరు నెలల లోపు మళ్ళీ సమావేశం కావలసి ఉంది. సాధారణంగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఏళ్ళ తరబడి ఏవో కొన్ని మినహాయింపులతో జులై ఆఖరు ప్రారంభం అవుతూ ఉంటాయి.
కానీ ఈ ఏడాది మహమ్మారి కారణంగా అసాధారణ పరిస్థితుల మధ్య మన జీవనం సాగుతోంది. గత నాలుగు నెలలుగా మహమ్మారిని ఎప్పటికప్పుడు కట్టడి చేసే పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలమునకలై ఉన్నాయి. ప్రజా ప్రతినిధులు పాలనలో ప్రజలతో మరియు స్థానిక ప్రభుత్వాలతో కలిసి పని చేసే దిశగా నిమగ్నమై ఉన్నారు. దేశ వ్యాప్తంగా ప్రయాణాల విషయంలో ఆంక్షలు కూడా ఉన్నాయి.
మే నెలలలో దేశీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలను సడలించటం, రైలు ప్రయాణాల్లో కొంత మేర వెసులుబాటు లాంటి వాటి వల్ల పార్లమెంట్ ఉభయ సభల శాఖా సంబంధింత స్టాండిగ్ కమిటీలు ఈ నెలలో తమ సమావేశాలను తిరిగి ప్రారంభించాయి. వారు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు, వలస కార్మికుల సమస్యలు, వైద్య కల్పనలో పురోగతి, మహమ్మారి నిరోధం, అది సమూలంగా దూరమయ్యే విషయానికి సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించారు. దీని అర్థం, మహమ్మారిని నిరోధించటానికి అవసరమైన పార్లమెంటరీ పరిశీలన దేశ అత్యున్నత శాసన వ్యవస్థకు సంబంధించిన సమావేశం మూడు నెలల్లో ప్రారంభమైంది. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఆలోచిస్తే, ఇంతకంటే తక్కువ వ్యవధి బహుశా సాధ్యం కాకపోవచ్చు.
కమిటీల సమావేశాలు మరియు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రారంభించడం గురించి నేను, లోక్ సభ గౌరవ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ఇప్పటి వరకూ అనేక పర్యాయాలు చర్చలు జరిపాము. సభలో చేయవలసిన ఏర్పాట్లు, మార్పులు, సాంకేతిక వ్యవస్థలపై విస్తృతంగా చర్చించాము. కరోనా పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని భౌతిక దూర ప్రమాణాల ప్రకారం ఎంపీలు కూర్చోవడానికి ఏర్పాట్లు, చర్చలకు అనువైన అంశాల గురించి వివరణాత్మక చర్చ మరియు ప్రణాళికలు అవసరం. వర్షాకాల సమావేశాలు నిర్వహించే విషయంలో ఇటీవలే ప్రభుత్వం ప్రిసైడింగ్ అధికారులను సంప్రదించింది. ప్రస్తుతం మేము ఆ పనిలోనే ఉన్నాము.
చివరగా మహమ్మారి ఎదుర్కోవడంలో, ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో, అవగాహన కల్పించడంలో, సాధికారతను అందించడంలో విశ్వసనీయ భాగస్వామిగా సంక్షోభ సమయంలో మన జీవితంలో కీలక పాత్ర పోషించిన మీడియా సిబ్బంది పనితీరును నేను మరో సారి అభినందిస్తున్నాను. ముందు వరుస యోధులుగా వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులతో కలిసి వారు అందించిన సహకారాన్ని మనమంతా గుర్తించి వారిని అభినందించాల్సి ఉంది.