విక్రమ్ కుమార్ తో చైతూ మూవీ

విక్రమ్ కుమార్ తో చైతూ మూవీ

ఈ మధ్య కాలంలో కథల విషయంలో నాగచైతన్య ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు. వైవిధ్యభరితమైన కథలకు .. పాత్రలకు ప్రాధాన్యతనిస్తున్నాడు. ఇందుకు ‘మజిలీ’ సినిమానే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఆయన కెరియర్లోనే చెప్పుకోదగినదిగా నిలిచింది. సున్నితమైన భావాలను కూడా చక్కగా పలికించాడనే పేరు తెచ్చింది. ఆ తరువాత సాయిపల్లవితో కలిసి ఆయన చేసిన ‘లవ్ స్టోరీ’ కూడా విభిన్నమైన కథాకథనాలతో రూపొందింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా, ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.’లవ్ స్టోరీ’ విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే చైతూ మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ టచ్ ఉన్న ఈ కథకి ‘థాంక్యూ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో చైతూ రొమాన్స్ చేయనున్నాడు. ఆల్రెడీ ఒక కథానాయికగా రాశి ఖన్నాను తీసుకున్నారు. మిగతా ఇద్దరు కథానాయికలుగా అవికా గోర్ .. మాళవిక నాయర్ కనిపించనున్నారని తెలుస్తోంది. ‘హలో’ సినిమాతో అఖిల్ కి హిట్ ఇవ్వడానికి ప్రయత్నించిన విక్రమ్ కుమార్, చైతూ విషయంలో ఆ ముచ్చట తీర్చుకుంటాడేమో చూడాలి.