తమిళంలో భారీ యాక్షన్ మూవీగా విక్రమ్

తమిళంలో భారీ యాక్షన్ మూవీగా విక్రమ్

ప్రయోగాత్మక చిత్రాలను చేయడంలో కమల్ ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన పోషిస్తూ వచ్చిన విభిన్నమైన పాత్రలే జయాపజయాలకు అతీతంగా ఆయనను నిలబెట్టాయి. తనతో ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ఇతర నిర్మాతలు ఆలోచన చేసినప్పుడు, తనే నిర్మాతగా రిస్క్ తీసుకుని ఆ ప్రయోగాలను తెరపైకి తీసుకొచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా ఈ సారి ఆయన చేస్తున్న మరో ప్రయోగం పేరే ‘విక్రమ్’. కమల్ తన సొంత బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.కోలీవుడ్ లో మురుగదాస్ తరువాత ఆ స్థాయి దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్ ఎదుగుతున్నాడు. సందీప్ కిషన్ తో చేసిన ‘మానగరం’ (నగరం) … కార్తి హీరోగా చేసిన ‘ఖైదీ’ ఆయన స్క్రీన్ ప్లే నైపుణ్యానికి అద్దం పడతాయి. ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘విక్రమ్’ సినిమాలో విలన్ పాత్రకు గాను చాలామంది ఆర్టిస్టుల పేర్లను పరిశీలించారు.చివరికి తాజాగా మలయాళ నటుడు ‘ఫహాద్ ఫాజిల్’ ను ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. మలయాళంలో తెరపై పాత్రను మాత్రమే కనిపించేలా చేసే నటుల్లో ఫహాద్ ఫాజిల్ ఒకరు. ఆయనే ఈ సినిమాలో కమల్ ను ఢీకొట్టనున్నాడు. ప్రస్తుతం ఫహాద్ ఫాజిల్ తెలుగులో ‘పుష్ప’ సినిమాలో విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.