ఫోటో జర్నలిస్టు సహకరించాలని విరుష్క జంట వినతి

ఫోటో జర్నలిస్టు సహకరించాలని విరుష్క జంట వినతి

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు ఇప్పుడు పుత్రికోత్సాహంలో ఉన్నారు. సోమవారం విరుష్క జంటకు అమ్మాయి పుట్టిన సంగతి తెలిసిందే. అయితే, అప్పట్నుంచి తమకంటూ కొంత ప్రైవసీ కావాలంటూ విరాట్, అనుష్కలు కోరుతున్నారు. తాజాగా ఫొటో జర్నలిస్టులకూ అదే విజ్ఞప్తి చేశారు. తమ ఫొటోలు ఫర్వాలేదు గానీ.. పాపవి మాత్రం వద్దంటూ కోరారు. బుధవారం ముంబైలోని ఫొటో జర్నలిస్టులకూ విరుష్క జంట నోట్ ను పంపారు.‘‘ఇన్నేళ్లు మాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. పాప పుట్టిన ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడం మరింత ఆనందంగా ఉంది. బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా మేం మిమ్మల్ని కోరేది ఒక్కటే. మా బిడ్డ ప్రైవసీని మేము కాపాడాలి. ఈ విషయంలో మీ మద్దతు, మీ సాయం మాకు కావాలి. దయచేసి మా బిడ్డకు సంబంధించి ఏ ఫొటోనూ ప్రచురించొద్దు. కావాలంటే మాకు సంబంధించిన వార్తలు, ఫొటోలు వేసుకోండి. మా విజ్ఞప్తిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం’’ అంటూ ఆ ఫొటో జర్నలిస్టులకు రాసిన నోట్ లో వారు పేర్కొన్నారు.