విశ్వేశ్వర్ రెడ్డి బిజెపిలో చేరుతున్నట్లు ప్రచారం 

విశ్వేశ్వర్ రెడ్డి బిజెపిలో చేరుతున్నట్లు ప్రచారం

తాను బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలపై తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్పందించారు. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ హవా కొంత పెరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అది మరింత ఎక్కువైంది. కింది స్థాయి టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పలువురు బీజేపీలో చేరుతున్నారు. మరికొందరు ఆ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్‌ను కలిసినట్టు కూడా ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై విశ్వేశ్వర్‌రెడ్డి స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని, పూర్తిగా అవాస్తవమని కొట్టిపడేశారు. తనకు ప్రతి పార్టీలో స్నేహితులు ఉన్నారని చెప్పుకొచ్చారు.