జగజ్యోతి శ్రీ బసవేశ్వరుని జయంతి

ఆదివారం 26.04.2020 నాడు 887వ బసవేశ్వరుని జయంతి సందర్బంగా మానవాతీత ఆ మహానీయుని మధురస్మృతులు.

జ్ఞానమే గురువు, ఆచారమే లింగం, అనుభవమే జంగమమని మహానీయులు బసవణ్ణ ఆచరించారు అనుసరించాలని భోదించారు.

మన క్రియలోనే సాక్షాత్తు ఆ పరమ శివున్ని చూసే ‘కాయకమే కైలాసము’. ఆనాడే అనుభవ మంటపాన్ని బసవేశ్వరులు స్థాపించి అందులో జాతి కుల వర్గ వర్ణ బేధాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించిన మహోన్నత వ్యక్తి,
శక్తి మన బసవేశ్వరులు.

లింగాయత ధర్మ సృష్టికర్త మహాత్మా బసవేశ్వరుడు విశ్వ గురువు, మహామానవతా వాది, సంఘసంస్కర్త. కుల, మత, వర్గ, వర్ణ వ్యవస్థను రూపుమాపుతూ 12వ శతాబ్దంలోనే సమాజంలో ఓ సాంఘిక విప్లవకారుడు. స్త్రీ, పురుషులు సమానమే, అసమానతలను ఉండరాదని పోరాడిన అభ్యుదయవాది.

మూఢాచారాలు, అంటరాని సాంప్రదాయాలను వెంటాడి తిరుగుబాటు జెండా ఎగురవేసిన తొలితరం సంఘసేవకుడు బసవేశ్వరుడు.

బాల్య వివాహాలు, సతీసహగమనం, దళితులకు ఆలయ ప్రవేశం, తొలి కులాంతర వివాహం అమలు చేసిన క్రాంతి పురుషుడు.

క్రీ.శ.1134లో (ఆనందనామ సంవత్సర, వైశాఖమాస, అక్షయ తృతీయ రోజున) కర్ణాటక రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా బాగేవాడి గ్రామంలో తల్లిదండ్రులు మాదాంబికా మాదిరాజు దంపతులకు
మహనీయులు అగ్ర వర్ణంలో జన్మించారు.

జగమెరిగిన శ్రేష్ట దార్శనికుడు, ముక్తసమాజపు వైతాళికుడు, శాంతి సామరస్యాలతో సహజీవనం, సుఖ సంతోషాలకు కష్టపడి పని చేయాలని, నిరాడంబర జీవనం గడపాలని ఉపదేశించారు. వ్యక్తుల జీవితాల్లో మార్పుల కోసం సమాజ గమనాన్ని ప్రభావితం చేస్తూ బసవేశ్వరులు ఓ కొత్త ధర్మాన్ని సృష్టించారు. బసవణ్ణ ఆగమనంతో సమాజంలో అన్ని బంధాల నుంచి విముక్తి పొందారు. వర్గ, వర్ణ, లింగ భేదాల సంకెళ్లు తెంచేసి ఓ అద్భుత నూతనోత్తేజీత సమసమాజాన్ని శంకుస్థాపన చేసారు. మహాత్మా బసవేశ్వరుడు సమ సమాజ స్థాపనకై సాక్షాత్తు భగవంతుడినే భక్తుడి వద్దకు వచ్చేలా ఇష్టలింగమును సృష్టించి పరమశివుని ప్రతి రూపంగా భావించి పూజలు చేయాలని గుడి సంస్కృతి, కుల వ్యవస్థలకు చరమగీతం పాడారు. ప్రపంచం ఆయురారోగ్యాలు కోసం చేస్తోన్న యోగాను ఆనాడే ఇష్టలింగపూజలో జతచేసారు. శాకాహారాన్ని భుజిస్తూ ఇష్టలింగాదరణ, ఇష్టలింగ పూజ చేయడమే ఆ మహాత్ములు బసవణ్ణ బోధించిన భక్తి మార్గం.

నిరాకారుడైన శివుడే సర్వేశ్వరుడు, శివుడిని మించిన దైవం లేదన్న విశ్వాసంతో, శివతత్వ ప్రచారానికి పూనుకొని ఇష్టలింగధారణ చేసి లింగాయత ధర్మానికి బసవణ్ణ బీజాలు వేశారు.

లింగాయత ధర్మానికి నేడు కర్ణాటక ప్రభుత్వం మైనారిటీ హోదా ఇచ్చి ప్రత్యేక మతంగా పరిగణించాలని కేంద్రానికి సిఫారసు చేసింది. బసవణ్ణ 64 లక్షల వచనాలు రచించారని ప్రతీతి ఇప్పుడు మాత్రం కొన్ని వేలు మాత్రమే లభ్యమవు తున్నాయి.

పాల్కురికి సోమనాథుడు తన ఆరాధ్య దైవమైన బసవేశ్వరునిపై బసవపురాణం రాసారు. మహాత్మా బసవేశ్వరుల గొప్పతనాన్ని కొనియాడుతూ భారత ప్రభుత్వం పార్లమెంటు ప్రాంగణంలో బసవేశ్వరుల విగ్రహం ఏర్పాటు చేసింది.

తెలంగాణ నివాసులైన డాక్టర్‌ నీరజ్‌ పాటిల్‌ కృషితో
ప్రధాని నరేంద్ర మోదీ లండన్‌లో మహాత్మా బసవేశ్వరుల విగ్రహాన్ని ఆవిష్కరింప చేశారు.

2006లోనే భారత ప్రభుత్వం 5₹ మరియు 100₹ బసవణ్ణ నాణాలను విడుదల చేస్తూ ఆ మహనీయులు బసవేశ్వరుడిని స్మరించుకుంది.

తెలంగాణ ప్రభుత్వం బసవేశ్వరుడి జయంతిని ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహిస్తున్నది. ట్యాంక్‌ బండ్‌పై బసవేశ్వరుడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.

లింగాయత్ ధర్మం పుట్టుకతో అందరు సమానం జాతి, వర్గ వీవక్షత, తారతమ్యం, భేదాలు లేకుండా దీక్ష సంస్కారం పొందవచ్చునని చెప్పేదే లింగాయత్‌ ధర్మం.