జాగ్రత్తే కరోనాకు దివ్యౌషధం

జాగ్రత్తే కరోనాకు దివ్యౌషధం

విష్ణు సహస్ర నామాల్లో భయకృత్, భయ నాశనః అని రెండు పేర్లు. అంటే భయ పెట్టేవాడు, భయాన్ని పోగొట్టేవాడు అని అర్థం. భయాన్ని పోగొట్టేవాడిగా దేవుడికి పూజ చేయడంలో అర్థముంది. అసలు భయ భక్తులు విడదీయడానికి వీలులేని ద్వంద్వ సమాసం. మిగతా యుగాల్లో ముందు భక్తి తరువాత భయం ఉండేవేమో కానీ, ఈ యుగంలో భయం వల్ల ఏర్పడ్డ భక్తి కాబట్టి- భయ భక్తుల వరుస, ఆ మాట వ్యుత్పత్తి సరిపోయింది. అంప శయ్య మీద భీష్ముడు చెప్పగా విని, వ్యాసుడు రాయగా మహా భారతంలో అంతర్భాగంగా భగవద్ గీత, విదుర నీతిలా మనకు దొరికింది విష్ణు సహస్రనామం.

కరోనా వైరస్ వ్యాపించకూడదంటే రోజూ విష్ణు సహస్రనామ పారాయణం చేయాలని చెబుతున్నారు. అయితే మన ప్రస్తావనకు- పారాయణకు సంబంధం లేదు. ఒకవేళ ఎవరికయినా ఆలా అనిపిస్తే పుణ్యమే కానీ, పాపం కాదు. అంతటి అందగాడు, శాంతస్వరూపుడు, పద్మ నయనంబుల వాడు, కృపారసంబు పై జల్లెడు వాడు, నవ్వురాజిల్లెడు మోమువాఁడు అయిన విష్ణువు భయకృత్ – భయపెట్టేవాడు ఎలా అయ్యాడు? ఎందుకయ్యాడు? అలా భయపెట్టడాన్ని గుణగానంగా మనం పరవశించి ఎందుకు పారాయణ చేస్తున్నాం? అన్నది ప్రస్తుతం మన చర్చ.

పిల్లలు మాట వినకపోతే తల్లిదండ్రులు కోప్పడతారు. విద్యార్థులు మాట వినకపోతే అయ్యవార్లు కోప్పడతారు. ఇందులో పగ, ప్రతీకారం, కసి, కోపం, ద్వేషం, అసూయ ఏమీ ఉండవు. బాధ్యత, తపన, దారిలో పెట్టడం, పెద్దరికం, నడవడి నేర్పడం లాంటి మంచి గుణాలే ఉంటాయి.

జనం మాట వినకపోతే ప్రభుత్వం కూడా భయపెడుతుంది. భయపెట్టాలి. ప్రభుత్వంలో భయపెట్టడానికి రాష్ట్రంలో అయితే పోలీసులు, కేంద్రంలో అయితే మిలటరీ ఉంటుంది. పాకిస్థాన్ లాంటి దేశాల్లో చాలా సందర్భాల్లో మిలటరీ చేతుల్లో ప్రభుత్వం బందీ అయి ఉంటుంది. అదృష్టం కొద్దీ మన దేశంలో ప్రభుత్వాల చేతిలోనే మిలటరీ, పోలీసు ఉంటుంది. మనదేశంలో పుట్టకపోయినా, మనదేశానికి వచ్చిన, మోసుకుని తెచ్చిన, సంక్రమింపజేసిన కరోనాతో చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో జనజీవనం స్తంభించిపోయింది. ఎప్పుడూ అలవాటులేని లాక్ డౌన్లు, అప్రకటిత కర్ఫ్యూలు, సరిహద్దుల మూసివేతలు, స్వీయ గృహ నిర్బంధాలు, స్వీయ నియంత్రణలు, జాగ్రత్తలు ఎన్నెన్నో? కరోనాకు ఇప్పటికయితే మందులేదు. సామాజిక దూరం, ఐసొలేషన్ లే ప్రస్తుతానికి మందు. ఒక నెలపాటు ఈ ఆంక్షలు ఉండే అవకాశముంది. ఆంక్షలను ధిక్కరిస్తే కనిపిస్తే కాల్చివేతలు, మిలటరీని రప్పించాల్సి ఉంటుందని హెచ్చరికలు వస్తున్నాయి.

మెజారిటీ జనం ఆంక్షలను గౌరవించి ఇళ్లల్లోనే ఉంటున్నారు. కరోనా సోకినా పరవాలేదనుకుని అర్జెంట్ పనులున్నాయనుకుని తిరిగేజనం తిరుగుతూనే ఉన్నారు. ఎవరి గోల వారిది. పోలీసులకు ఒళ్లు మండుతోంది. అసలే కరోనా మసలే పాడుకాలంలో స్వీయ గృహ నిర్బంధంలో ఉండడానికి వీల్లేని ఉద్యోగంతో మామూలు రోజులకంటే ఇప్పుడు వారు ఎక్కువగా పనిచేయాల్సి వస్తోంది. వందల, వేల మంది రోడ్ల మీదికి వచ్చేసరికి- ఇక లాభం లేదనుకుని భయపెట్టడం కంటే, శిక్షించడమే నయమని దుడ్డు కర్రలకు పని చెప్తున్నారు. ధర్మం వేరు. ధర్మ సూక్ష్మం వేరు. ధర్మ సూక్ష్మం ప్రకారం కర్ర ఉంటే కొట్టాలి. తుపాకి ఉంటే కాల్చాలి అని పోలీసులు సమర్థించుకోవచ్చు.

ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో ఉన్న దేశాల్లో కరోనా దెబ్బకు వందలు, వేల మంది పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రభుత్వాధినేతలు ఏమీ చేయలేక చేతులెత్తేసి మింటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నారు. విపరీతమయిన జనసాంద్రత, అత్యాధునిక వైద్య సదుపాయాలు లేని, కోట్ల కొద్దీ నిరుపేదలు ఉన్న మన దేశంలో ఇటలీలా కరోనా కోరలు సాచి, జడలు విప్పి, కరాళ నృత్యం చేస్తే ఏది ఊరో? ఏది వల్లకాడో? తెలియని భయంకరమయిన పరిస్థితి దాపురిస్తుంది.

దేవుడికన్నా దెబ్బే గురువు. కరోనా రాకుండా భయంగా ఇంటిపట్టున ఉండడమే మనకు, ఎదుటివారికి ఆరోగ్యం. మనదాకా రాదనుకుని ఎలా పడితే అలా తిరిగేవారిని దేవుడుకూడా రక్షించలేడు. ఎందుకంటే- కరోనా దెబ్బకు దేవుడే ముక్కుమూసుకుని, గుడి తలుపులు వేసుకుని మూల కూర్చోగా- ఆఫ్టర్ ఆల్ మనుషులు- మనమెంత?

బాబ్బాబూ! అమ్మా తల్లీ! దయచేసి జాగ్రత్తగా ఉండండి. పాడుకాలం త్వరగా పోయి, జీవితం మళ్లీ కొత్త రాగంతో పాడుకునే కాలం వచ్చేదాకా ఓపిక పట్టండి.

భయకృత్, భయ నాశనః
భయపెట్టేవాడు, భయాన్ని పోగొట్టేవాడు- మాటలకు అర్థం వివరించి చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సార్లు భయం ఆరోగ్యం. అవసరం. అందుకే భక్తితో సమానంగా భయం ద్వంద్వ సమాసంలో ఉంది. భయం లేని భక్తికి విలువ లేదు. భక్తి లేని భయానికి అర్థం లేదు. కరోనాకు భయమూ లేదు, భక్తీ లేదు. కాబట్టి కరోనాను భయపెట్టే భయకృత్ జాగ్రత్తలు ఒక్కటే దివ్యౌషధం!    -పమిడికాల్వ మధుసూదన్