దిగ్గజ కంపెనీలకు WELCOME టూ ఇండియా సర్వంసిద్ధం

కరోనా వైర‌స్ దెబ్బ‌కు చైనా వ‌దిలి పారిపోయే దిగ్గ‌జ కంపెనీలపై భార‌త్ చూపు ప‌డింది. చైనా నుంచి పీఛేముడ్ అవుతున్న దిగ్గ‌జ కంపెనీల‌ను ఆక‌ర్షించుకోడానికి భార‌త్ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది.

భార‌త దేశంలో పెట్టుబ‌డుల‌కు ముందుకు వ‌స్తే భారీగా రాయితీలు ఇవ్వ‌డానికి కార్య‌చ‌ర‌ణ సిద్ధం చేస్తోంది. పశ్చిమ ఐరోపా దేశం లక్సెంబర్గ్‌ దేశ విస్తీర్ణంతో పోలిస్తే భార‌త్‌లో రెట్టింపు భూమి కేటాయించేందుకు అవకాశం ఉందని గుర్తించారు. కొత్త‌గా ఏర్పాటు చేసుకునే పరిశ్రమల కోసం భారత్‌లో మొత్తం 4,61,589 హెక్టార్ల స్థలాన్ని గుర్తించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇందులో 1,15,131 హెక్టార్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడుల్లో పారిశ్రామిక స్థలంగా ఉంది. భార‌త్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఇప్ప‌టి వ‌ర‌కు స్థ‌ల‌సేక‌ర‌ణ పెద్ద స‌మ‌స్య‌గా ఉంది. అయితే క‌రోనా కాలంలో యావ‌త్ ప్ర‌పంచం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. దీంతో క‌రోనా వ‌ల్ల ఎదురైన న‌ష్ట‌నివార‌ణ‌కు కేంద్రం దిగ్గ‌జ కంపెనీల వైపు దృష్టిని సారించిన‌ట్టు తెలుస్తోంది. కరోనా వైరస్‌ కారణంగా మారిన పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు ప్రధాన మంత్రి మోదీ అధికార బృందం.. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

దీనిలో భాగంగా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన స్థ‌లం కేటాయింపుతో పాటు విద్యుత్‌, నీరు, రహదారి సౌలభ్యం కల్పిస్తే పెట్టుబడులను ఆకర్షించడం సులభంకానుంది. మ‌రోవైపు రాష్ట్రాలు సొంతంగా పెట్టుబడులను ఆకర్షించడానికి అవ‌స‌ర‌మైన కార్య‌చ‌ర‌ణ ప్ర‌ణాళిక‌తో ముందుకువెళ్ళాల‌ని కేంద్రం సూచిస్తోంది. కాగా జపాన్‌, అమెరికా, దక్షిణ కొరియా దేశాల కంపెనీలతో ఇప్ప‌టికే ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం చర్చలు జరుపుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం సుదూర‌ సముద్ర తీరం కలిగి ఉండటంతో పాటు రెడీమేడ్‌ పారిశ్రామిక పార్కులు పెట్టుబడుల ఆకర్షణకు తోడ్పడతాయని ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్‌ భార్గవ పేర్కొంటున్నారు.